దీపావళి పర్వదినం నాడు ఇంకొల్లులో జరిగిన యువతిని హత్య కేసు మిస్టరీని వారం రోజుల లోపే పోలీసులు ఛేదించి ముద్దాయిని అరెస్టు చేశారు. పఠాన్ జానీ అనే వ్యక్తి ఇంట్లో గోరంట్ల బాపూజీ అనే యువకుడు రక్తపు మడుగులో పడి ఉండగా గత మంగళవారం నాడు అతడిని ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందడం తెలిసిందే.
దీంతో ఈ హత్య కేసు లో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు జరిపి ముద్దాయి పఠాన్ జానీ ని సోమవారం అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన గడ్డపారను కూడా స్వాధీనపర్చుకున్నారు.
ఇంకొల్లు సీఐ సూర్యనారాయణ కథనం ప్రకారం ఈ నెల 24వ తేదీ రాత్రి పఠాన్ జానీ, గోరంట్ల బాపూజీ మద్యం సేవించారు. ఈ సందర్భంగా బాపూజీ తాగిన మత్తులో పఠాన్ జానీ మేనకోడలిని ఉద్దేశించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు. పఠాన్ జానీ ఎంతగా వారించినా బాపూజీ అంతకంటే ఎక్కువ రెచ్చిపోయాడు.
ఆ రాత్రి పఠాన్ జానీ ఇంట్లోనే గోరంట్ల బాపూజీ పడుకున్నాడు. అయితే బాపూజీ కారణంగా భవిష్యత్తులో తన మేనకోడలికి ఏదైనా ప్రమాదం వాటిల్లవచ్చునని భావించిన పఠాన్ జానీ అతడిని చంపేయాలని నిర్ణయించుకుని గడ్డపారతో తలపై బలంగా మోదాడు. తదుపరి పరారయ్యాడు. అయితే నైట్ బీట్ తిరుగుతున్న పోలీసులకు విషయం తెలిసి క్షతగాత్రుడిని 108 అంబులెన్సు లో ఒంగోలు తరలించారు. అక్కడ బాపూజీ మరణించాక పోలీసులు నిందితుడి కోసం గట్టిగా గాలించి చివరకు పట్టుకున్నారు. జానీ నేరం అంగీకరించి మారణాయుధాలను కూడా స్వాధీన పరిచాడు
కాగా వారం రోజుల్లోపల హత్య కేసును ఛేదించిన ఇంకొల్లు సీఐ సూర్యనారాయణ, ఎస్ఐ నాయబ్ రసూల్, వారి పోలీసు బృందాన్ని జిల్లా ఎస్పీ జిందాల్ అభినందించారు.