తిరుమల శ్రీవారి పేరుపై ఉన్న ఆస్తుల వివరాలను టీటీడీ వెల్లడించింది. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఫిక్స్‌డ్ డిపాజిట్ల విషయంలో వస్తున్న వదంతులను నమ్మవద్దని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రజలను కోరింది. టీటీడీ బోర్డు ఆమోదించిన విధివిధానాల ప్రకారమే బ్యాంకుట్లో డిపాజిట్లు చేసినట్లు టీటీడీ వెల్లడించింది. ఈ మేరకు శ్రీవారి ఆస్తులకు సంబంధించి శనివారం టీటీడీ శ్వేతపత్రం విడుదల చేసింది.
ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి పేరుపై ఉన్న ఆస్తుల వివరాలను టీటీడీ వెల్లడించింది. ఇందులో భాగంగా శ్రీవారికి బ్యాంకుల్లో మొత్తం రూ. 15, 938 కోట్ల డిపాజిట్లు ఉన్నట్లు టీటీడీ తెలిపింది. అలాగే, శ్రీవారికి 10,258.37 కేజీల బంగారం ఉన్నట్లు వివరించింది. దేశంలోని 24 జాతీయ బ్యాంకుల్లో నగదు డిపాజిట్ చేసినట్లు టీటీడీ తెలిపింది. గత మూడేళ్లలో స్వామి వారి నగదు, డిపాజిట్లు భారీగా పెరిగినట్లు టీటీడీ తెలిపింది.