భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం ఆదివారం భక్త జనసందోహంగా మారింది. రెండు రోజులుగా వరుస సెలవు దినాలు రావడంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల ఉంచి వేల సంఖ్యలో భక్తులు రామయ్యను దర్శించేందుకు పోటెత్తారు. దీంతో రామాలయం పరిసరాలు, గోదావరి నదీ తీరం సందడిగా మారింది. గత రెండు రోజులుగా రామయ్యను దర్శించుకున్న భక్తులు 25 వేల మంది వరకు ఉండవచ్చునని దేవస్థానం వర్గాలు అంచనా వేస్తున్నాయి. తెల్లవారుజాము నుంచే పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి రామాలయంలోని క్యూలైన్లలో బారులు తీరారు.
ఆదివారం కావడంతో మూలవరులకు పంచామృతాభిషేకాన్ని సువర్ణ పుష్పార్చనను ఆర్జితసేవగా నిర్వహించారు. సహస్రనామార్చన, కేశవనామార్చన, నిత్యకల్యాణం తదితర పూజలను సైతం నిర్వహించారు. నిత్యకల్యాణంలో 161జంటలు పాల్గొన్నాయి. 47 అభిషేకాలు, సువర్ణపుషార్చనలో 389 మంది భక్తులు పాల్గొన్నారు. భక్తులు భారీగా తరలిరావడంతో దేవస్థానం అధికారులు ప్రసాదాలను సైతం భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఎప్పటికప్పుడు పెంచుతూ భక్తులకు అందుబాటులోకి తెచ్చారు. దేవస్థానం ఈవో బి. శివాజీ, ఏఈవో శ్రావణ్ కుమార్, పర్యవేక్షకుడు కత్తి శ్రీనివాస్ తదితరులు ఎప్పటికప్పుడు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పర్యవేక్షించారు.