కొందరి జీవితాలు ఎందరికో పాఠాలు నేర్పుతుంది. ఓ ఇరాన్ వ్యక్తి జీవితం కూడా అదే కోణంలో సినిమా కెక్కింది. 18 ఏళ్లుగా ఎయిర్‌పోర్టులోనే నివసిస్తున్న ఇరాన్ వ్యక్తి అక్కడే కన్నుమూశాడు. పారిస్ విమానాశ్రయంలోనే ఉంటున్న మెహ్రాన్ కరీమీ నస్సేరి శనివారం రాత్రి మరణించాడు. గుండెపోటు వల్ల అతను చనిపోయాడని ఎయిర్‌పోర్ట్ అధికారులు తెలిపారు. 18 ఏళ్లు ఎయిర్‌పోర్టులోనే ఉన్న మెహ్రాన్ కరీమీ నస్సేరి ప్రేరణగా తీసుకుని ప్రముఖ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ 2004లో టామ్ హాంక్ హీరోగా ‘ది టెర్మినల్’ సినిమాను తీశారు.
మెహ్రాన్ కరీమీ చనిపోయినట్టు పారిస్‌లోని చార్లెస్ డి గల్లె విమానాశ్రయ అధికారులు కూడా నిర్ధారించారు. సరైన రెసిడెన్స్ సర్టిఫికెట్ లేని కారణంగా 1988లో ఆయనను పారిస్‌లోకి వచ్చేందుకు అధికారులు అనుమతించలేదు. దాంతో ఆయన ఎయిర్‌పోర్ట్ టెర్మినల్‌లోనే ఉండిపోయాడు. కొన్ని రోజుల తర్వాత అతడికి శరణార్థి పత్రాలు మంజూరైనప్పటికీ వాటిపై సంతకం చేయడానికి నస్సేరి ఒప్పుకోలేదు. దాంతో అప్పటి నుంచి ఎయిర్‌పోర్ట్‌లోనే ఉండిపోయాడు.
మెహ్రాన్ కరీమీ తన వస్తువులను ఎయిర్‌పోర్ట్‌లోని ఓ చోట పెట్టుకుని అక్కడే పుస్తకాలు చదువుతూ కాలక్షేపం చేసేవాడు. తన అనుభవాలను డైరీలో రాసుకుంటూ గడిపేవాడు. తన రోజులో ఎక్కువసేపు ఆర్థికశాస్త్రం పుస్తకాలను చదవడానికి కేటాయించేవాడు. అయితే 2006లో ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో కొన్నిరోజులపాటు ఆయన ఎయిర్‌పోర్టును వీడాడు. మళ్లీ ఆరోగ్యం మెరుగవగానే తిరిగి అదే ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు.
మెహ్రాన్ కరీమీ నస్సేరి తండ్రి ఓ ఇరాన్ దేశానికి చెందిన వ్యక్తి. తల్లి స్కాటిష్. అయితే నస్సేరి రాజకీయ ఉద్యమాల్లో ఉండేవాడు. ప్రజల హక్కుల కోసం పోరాడుతుండేవాడు. ఆ క్రమంలో అతనిని ఇరాన్ ప్రభుత్వం జైళ్లో పెట్టింది. తర్వాత కొన్ని రోజులకు మెహ్రాన్ కరీమీ నస్సేరి దేశ బహిష్కరణ కూడా విధించారు. దాంతో నస్సేరి శరణార్థిగా ఉండేందుకు ఎలాంటి పత్రాలు లేకుండా పారిస్ చేరుకుని లండన్ వెళ్లేందుకు ప్రయత్నించాడు. దాంతో అతడిని పోలీసులు పట్టుకుని వెనక్కి పంపించారు. అప్పటి నుంచి చనిపోయేంత వరకు ఆయన ఎయిర్‌పోర్టులోనే ఉండిపోయాడు.