"వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2022" నివేదిక ప్రకారం 2030 నాటికి ప్రపంచ జనాభా 850 కోట్లకు, 2050 నాటికి 970 కోట్లకు, 2080 నాటికి వెయ్యి కోట్లకు చేరనుంది. ఈ అంచనాలో సగానికిపైగా జనాభా పెరుగుదల కేవలం ఎనిమిది దేశాల్లోనే అంటే భారత్, పాకిస్థాన్, కాంగో, ఈజిప్టు, ఇథియోపియా, నైజీరియా, ఫిలిప్పీన్స్, టాంజానియాలో నమోదవుతుంది. 700 కోట్ల నుంచి 800 కోట్లకి చేరుకోవడంలో సగానికిపైగా (60 కోట్ల మంది) జనాభా ఆసియా దేశాల నుంచే ఉంది. మిగిలిన 40 కోట్ల జనాభా ఆఫ్రికా దేశాల్లో నమోదైంది. అలాగే సగటు ఆయు:ప్రమాణం కూడా పెరిగింది. సగటు ఆయు:ప్రమాణం 72.8 సంవత్సరాలు. 1990తో పోల్చితే తొమ్మిదేళ్లు పెరిగింది.
ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకుంది. "వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2022" నివేదిక ప్రకారం మంగళవారం నాటికి ప్రపంచ జనాభా ఎనిమిది బిలియన్లకు (800 కోట్లకు) చేరుకుంది. అంతేకాదు ఈ రిపోర్ట్ ప్రకారం 2023లో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనాను... భారత్ అధిగమించనుంది. నవంబర్ 15, 2022 నాటికి ప్రపంచ జనాభా 8 బిలియన్ల మార్కును చేరుకుంటుందని ఐక్యరాజ్యసమితి ఇప్పటికే అంచనా వేసింది. ప్రపంచ జనాభా 2030లో 8.5 బిలియన్లకు, 2050లో 9.7 బిలియన్లకు పెరగవచ్చని వెల్లడించింది.
దీంతో ఈ ఏడాది ప్రపంచ జనాభా దినోత్సవం సరికొత్త మైలురాయిని చేరుతుంది. అయితే ప్రపంచంపై జనాభా 600-700 కోట్లకు చేరడానికి 12 ఏళ్లు పట్టగా... 700-800 కోట్లకు చేరడానికి ఇంచుమించు ఇదే వ్యవధి పట్టిందని నివేదిక తెలిపింది. వైవిధ్యానికి, ఉమ్మడి మానవత్వానికి, మాతా శిశు మరణాల రేటు తగ్గింపు దిశగా ఆరోగ్య సంరక్షణలో విజయానికి ఇది వేడుకగా నిలుస్తున్న సందర్భమని ఐక్యరాజ్య సమితీ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ తెలిపారు. అయితే ప్రపంచ జనాభా పెరుగదలపై సోషల్ మీడియాలో రకరకాల మీమ్స్ మొదలయ్యాయి. కొందరు జనాభా కంట్రోల్ చేసే బిల్‌ను ప్రవేశపెట్టాలని కామెంట్లు పెట్టారు. కొందరు ఆశ్చర్యంతో కూడిన ఇమేజ్‌లు, వీడియోలు కూడా షేర్ చేస్తున్నారు.