తాజాగా చైనాలో జరిగిన ఓ మారథాన్ పై సోషల్ మీడియాలో పెద్ద చర్చ సాగుతోంది. ఆరోగ్య స్పృహ ఉన్నవాళ్లు... మారథాన్‌లో పాల్గొంటారు. మంచి అలవాట్లు ఉన్నవాళ్లు, నిత్యం ఎక్సర్‌సైజులు చేసేవాళ్లు.. కచ్చితంగా ఇలాంటి మారథాన్‌లలో ముందుంటారు. చైనాలో ఓ 50 ఏళ్ల వ్యక్తి 42 కిలోమీటర్ల మారథాన్‌ను విజయవంతంగా పూర్తి చేశాడు. అయితే మారథాన్ చేయడంలో పెద్ద విశేషం ఏమి లేదు.. కానీ ఈ వ్యక్తి స్మోక్ చేస్తూ మారథాన్ చేశాడు.
చైనాలో చెన్ అనే వ్యక్తి (50) సరికొత్త విధంగా పాపులర్ అయ్యాడు. గ్వాంగ్‌జౌలో దూమపానం చేస్తూ 42 కిలోమీటర్ల మారథాన్‌ను మూడు గంటల 28 నిమిషాల్లో పూర్తి చేశాడు. మారథాన్ మొదలైనప్పుడే మొత్తం సిగరెట్ ప్యాక్‌ని పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నట్టుగానే సిగరెట్లు తాగుతూ... మారథాన్ పూర్తి చేశాడు. ఇతరులతో కలసి నడుస్తున్నప్పుడు ఒకదాని తర్వాత ఒకటి సిగరెట్లను కాల్చాడు.
అంతేకాదు పోటీలో ఉన్న 1500 మందిలో 574వ రన్నర్‌గా నిలిచాడంట. దీంతో నిర్వాహకులు సర్టిఫికెట్‌ను ప్రదానం చేశారు. అయితే చెన్ ఇలాంటి వినూత్న ప్రయత్నాలు చేయడం ఇదేం మొదటి సారి కాదంట. గ్యాంగ్‌జౌ మారథాన్ 2018లో, 2019 జియామెన్ మారథాన్‌లో సిగరెట్లు తాగుతూ ధూమపానం చేస్తూ పాల్గొన్నాడు.
ఇక చెన్ ఫోటోలు నెట్టింట్లో తిష్ట వేసుకుని కూర్చున్నాయి. చైనా సోషల్ మీడియా విబోలో చెన్ ఫోటోలు వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలు చూసిన చైనీయులు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరు సిగరెట్లు తాగకపోయుంటే.. ఇంకా మెరుగైన ప్రతిభ కనబరిచేవాడని, మరొకరు అతని ఊపిరి తిత్తులు బాగా పని చేస్తున్నాయని కామెంట్లు పెట్టారు.