జి-20 సదస్సులో తొలిసారిగా రష్యా వ్యతిరేక గళం వినిపించింది. యూకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా అంతర్జాతీయ వేదికపై ప్రసంగించిన రిషి సునాక్.. ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తోన్న రష్యా అధినేత పుతిన్‌పై నిప్పులు చెరిగారు. ఇండోనేషియాలోని బాలి వేదికగా జరుగుతోన్న జి-20 సదస్సులో రష్యాపై సునాక్ విమర్శలు గుప్పించారు. ఇదో అనాగరిక యుద్ధమని, ఏ దేశమైనా తమ పొరుగు దేశంపై దాడి చేయకూడదని వ్యాఖ్యానించారు. ‘ఉక్రెయిన్ నుంచి మాస్కో బయటకు రావాలి. ఈ అనాగరిక యుద్ధాన్ని ముగించాలి’ అని రష్యా వైఖరిని తప్పుపట్టారు. యుద్ధంతో ప్రపంచ క్రమాన్ని బలహీనపరిచి, ఆర్థిక సమస్యలకు కారణమయ్యారని మండిపడ్డారు. ఆహారం, శక్తి అనే అయుధీకరణ ద్వారా ప్రస్తుతం ప్రపంచం తీవ్ర సంక్షోభం దిశగా సాగుతోందన్నారు. వీటన్నింటినీ మార్చగలిగే శక్తి ఒక్క మనిషికి మాత్రమే ఉందని ఉద్ఘాటించారు.
అలాగే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమావేశానికి గైర్హాజరుకావడంపై సునాక్ విమర్శలు చేశారు. ‘ఆయన వచ్చి ఉంటే.. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు ప్రయత్నించేవాళ్లం’ అని అన్నారు. ‘‘ఉక్రెయిన్ నుంచి రష్యా బయటకు వచ్చిన ఈ అనాగరిక యుద్ధాన్ని ముగించేలా ఎవరైనా చేయగలడమే పెద్ద తేడా.. ఇది కేవలం ఉక్రెయిన్‌కు మాత్రమే కాదు ప్రపంచానికి పరివర్తన’’ అని అన్నారు.
‘‘ఇది చాలా సులభం.. ఏ దేశమైనా తమ పొరుగు దేశాలపై దాడి చేయకూడదు.. పౌర మౌలిక సదుపాయాలు, పౌరులపై దాడి చేయరాదు.. అణ్వాయుధాలను ప్రయోగిస్తామని బెదిరింపులకు పాల్పడరాదు.. కచ్చితంగా ఇవి మనమందరం అంగీకరించే విషయాలు... రెండోది ఈ రోజు మనం దృష్టి సారించాల్సిన ఆర్థిక సమస్యలు రష్యా చర్యల వల్ల చాలా దారుణంగా తయారయ్యాయి... ఇంధనం, ఆహారం ఆయుధీకరణ పూర్తిగా ఆమోదయోగ్యం కాదు.. ఉక్రెయిన్ ఆహార ధాన్యాల్లో మూడింట రెండు వంతులు అభివృద్ధి చెందుతున్న దేశాలకు వెళుతున్నాయి.. అయినప్పటికీ ధాన్యాగారాన్ని రష్యా ను ధ్వంసం చేసింది.. రవాణాను నిరోధించింది.. ఇది ప్రపంచవ్యాప్తంగా పేదలకు హాని కలిగిస్తోంది. దీనికి ఆంక్షలతో సంబంధం లేదు.’’ అని సునాక్ వ్యాఖ్యానించారు.
ఈ సమావేశానికి రష్యా ప్రతినిధిగా హాజరైన ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్.. సునాక్ మాట్లాడుతున్న సమయంలో ఎదురుగానే ఉన్నారు. ఆయన ఎదురుగానే బ్రిటన్ ప్రధాని తన దేశ వైఖరిని స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌పై దండయాత్ర ప్రారంభించిన తర్వాత బ్రిటన్ ప్రధాని.. రష్యా ఉన్నతస్థాయి నేతతో ఎదురుపడి మాట్లాడడం ఇదే మొదటిసారి. అయితే, జి-20 శిఖరాగ్ర సమావేశంలో భాగంగా లావ్రోవ్ మాట్లాడుతూ.. చర్చలకు ఉక్రెయిన్ సముఖంగా లేకపోవడంతో యుద్ధం విషయంలో ఒక ఒప్పందానికి రావడం క్లిష్టంగా మారిందని లావ్రోవ్ వ్యాఖ్యానించారు.