ఏపీలో టీడీపీకి కొత్త కష్టాలు మొదలయ్యాయి. ఇన్నాళ్లు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలే టీడీపీని ఘాటుగా విమర్శించేవారు. ఇప్పుడు వారికి బీజేపీ కీలక నేతలు కూడా తోడయ్యారు. తాజాగా బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు.. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబుపై సెటైర్లు పేల్చారు. 'భగవంతుడయిన శ్రీరాముడితో తమ నాయకుడు చంద్రబాబును పోలుస్తూ అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాను. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే సహించేది లేదు. ఇతర పార్టీల పొత్తు కోసం పరితపిస్తూ.. ఈ బిల్డప్ ఏంటి? మీ నాయకుడి ఆరాటం "లోక"కళ్యాణం కోసం కాదు. "లోకేష్"కళ్యాణార్థం అని అందరికీ తెలుసు' అని జీవీఎల్
శనివారం రోజున తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడుతూ.. అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. 'రావణుడిని వధించేటప్పుడు రాముడు ఉడత నుంచి కోతుల సాయం కూడా తీసుకున్నారు. అదే తరహాలో ఇప్పుడు కూడా జగన్‌ను గద్దె దించడానికి అందరి సాయం తీసుకోవాలి. రాముడు బలవంతుడైనా, భగవంతుడైనా అందరి సాయం తీసుకున్నారు. అదే మాదిరిగా చంద్రబాబు కూడా తగిన నిర్ణయం సరైన సమయంలో తీసుకుంటారని ఆశిస్తున్నా' అంటూ అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. 'టీడీపీ అభ్యర్థులను ముందే నిర్ణయించాలి. సరిగా పని చేయని వారికి టికెట్ ఇచ్చేది లేదని చంద్రబాబు మొహమాటం లేకుండా చెప్పాలి. ఒకవేళ అయ్యన్నపాత్రుడు ఈ ఎన్నికల్లో గెలవలేడని అనుకంటే టికెట్ ఇవ్వొద్దు' స్పష్టం చేశారు. తనతో సహా క్షేత్రస్థాయిలో అనుకూల పరిస్థితి లేకపోతే.. టికెట్ ఇవ్వొద్దని చంద్రబాబుకు నేరుగానే చెప్పారు మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వచ్చే ఎన్నికల్లో పొత్తులపై ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పరోక్షంగా పొత్తులు పెట్టుకోవాలని ఆయన వ్యాఖ్యానించడం హాట్ టాపిక్‌గా మారింది.
ఈనేపథ్యంలోనే.. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సెటైర్లు వేశారు. ఇతర పార్టీల పొత్తు కోసం పరితపిస్తూ.. ఈ బిల్డప్ ఏంటి అని ప్రశ్నించారు. దీంతో పొత్తులు లేకుండా టీడీపీ ఎన్నికలకు వెళ్లలేదు అనే చర్చ జరుగుతోంది. ఒక విధంగా చెప్పాలంటే.. అసలు చంద్రబాబుకు ఒంటరిగా వెళ్లే ధైర్యం లేదని రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. ఆ విషయం తెలుసు కాబట్టే.. అయన్నపాత్రుడితో చంద్రబాబు ఇలా మాట్లాడించి ఉంటారని వ్యాఖ్యానిస్తున్నారు. అయ్యన్న కామెంట్స్‌తో మేలు జరుగుతుందని భావిస్తే.. ఇలా బూమరాంగ్ అయ్యిందని టీడీపీలో అంతర్గత చర్చ జరుగుతున్నట్టు సమాచారం.