సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసారు. ఆంధ్రప్రదేశ్ ఆక్వా విశ్వవిద్యాలయానికి, బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్‌కు, రూ.1,400 కోట్లతో జిల్లా రక్షిత నీటి సరఫరా ప్రాజెక్టులకు శంకుస్థాపన, నరసాపురం ప్రాంతీయ వైద్యశాల నూతన భవనానికి ప్రారంభోత్సవం చేసారు. అనంతరం బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు . సీఎం శంకుస్థాపన చేసిన ఆంధ్రప్రదేశ్ ఆక్వా విశ్వవిద్యాలయం దేశంలోనే మూడవది కానుంది. ఇప్పటి వరకు తమిళనాడు, కేరళలో మాత్రమే ఈ వర్సిటీలు ఉన్నాయి. ఆక్వా వర్సిటీ కోసం నరసాపురం పరిసర ప్రాంతాల్లోని సరిపల్లి, లిఖితపూడి గ్రామాల మధ్య 40 ఎకరాల భూమిని ఇప్పటికే కేటాయించారు. భవన నిర్మాణ పనుల కోసం రూ.332 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ ఆమోదించారు. మొదటి దశలో పరిపాలన భవనంతో పాటు విద్యార్థులకు వసతి గృహాలు, విశ్వవిద్యాలయం నిర్మాణానికి రూ.100 కోట్లు మంజూరు చేశారు. 2022–23 బడ్జెట్‌లో విశ్వవిద్యాలయ నిర్మాణ పనులకు రూ.40 కోట్లు కేటాయించారు.