కరోనా బారిన పడి మృత్యువు అంచుల వరకు వెళ్లి వచ్చిన కారంచేడు ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ భాస్కరరావు పూర్తిగా కోలుకొని తిరిగి విధుల్లో చేరడానికి సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా తనకు పునర్జీవం పోసిన సీఎం జగన్ ను సోమవారం సాయంత్రం డాక్టర్ భాస్కర్ రావు కుటుంబ సమేతంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
వివరాల్లోకి వెళితే కారంచేడు మండలంలో విధులు నిర్వర్తిస్తూ కరోనా మొదటి వేవ్ లో వందలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ భాస్కరరావు తనే ఆ వ్యాధి బారిన పడ్డారు. దీంతో ఊపిరితిత్తులు చెడిపోయి వాటిని మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆపరేషన్ కు దాదాపు ఒకటిన్నర కోటి రూపాయలు ఖర్చవుతుందని అపోలో ఆసుపత్రి తెలిపింది.
అయితే అంత ఆర్థిక స్తోమత లేని డాక్టర్ భాస్కరరావు భార్య డాక్టర్ భాగ్యలక్ష్మి అప్పటి మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. వాసు స్పందించి సి. ఎంజగన్ కు పరిస్థితి వివరించారు. సీఎం జగన్ చలించిపోయి ఆ ఆపరేషన్ కి అయ్యే కోటిన్నర రూపాయలను అప్పటికప్పుడు మంజూరు చేశారు. దీంతో భాస్కర్ రావు కు శస్త్ర చికిత్స విజయవంతంగా జరిగింది. ఆయన ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు. దీంతో కృతజ్ఞత భావంతో డాక్టర్ భాస్కరరావు సిఎం ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. మునుపుటి లాగే పేద ప్రజలకు వైద్య సేవలు అందించాల్సిందిగా ఈ సందర్భంగా జగన్ డాక్టర్ భాస్కరరావు దంపతులకు సూచించారు.