తెలుగుదేశం పార్టీ తాడిపత్రి నియోజకవర్గ ఇనచార్జి జేసీ అశ్మిత రెడ్డి లక్ష్యంగా బుధవారం సాయంత్రం రాళ్ల దాడి జరిగింది. తాడిపత్రి పట్టణంలోని మూడో వార్డులో పర్యటిస్తున్న ఆయనపై ప్రణాళిక ప్రకారం దాడి జరిగిందని టీడీపీ ఆరోపించింది. ఈ దాడిని టీడీపీ శ్రేణులు ప్రతిఘటించాయి. దీంతో ఇరువర్గాల వారికి గాయాలయ్యాయి. తాడిపత్రి పట్టణంలోని వివిధ వార్డులలో కొంతకాలంగా అశ్మిత రెడ్డి పర్యటించి, ప్రజల సమస్యను తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో 3వ వార్డులో బుధవారం సాయంత్రం పర్యటించారు. దీంతో వార్డులో పర్యటించవద్దని వైసీపీ వర్గీయులు అడ్డుకున్నారు. హాజీ, అడ్డు రఫీ తదితరులతో కలిసి పలువురు వైసీపీ వర్గీయులు రాళ్లతో దాడి చేశారు. వారిని ప్రతిఘటించేందుకు టీడీపీ వర్గీయులు కూడా రాళ్లు విసిరారు. ఈ గొడవలో టీడీపీ వర్గీయులు కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. వైసీపీ వర్గీయుడు హాజీ తకు గాయమైంది. ఈ ఘటనతో తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది.