జాతీయ స్థాయి కాలిగ్రఫీ పోటీలకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ దిల్లీరావు తనయుడు జివితేష్ ఎంపికయ్యాడు. వచ్చే ఏడాది జనవరి 22న జాతీయ చేతివ్రాత దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న నేషనల్ కాలిగ్రఫీ ఒలింపియాడ్‌కు ఆంధ్రప్రదేశ్ నుంచి జివితేష్ ఎంపిక కావటం విశేషం. ఇంతకు ముందే రాష్ట్రస్థాయిలో నిర్వహించిన చేతివ్రాత పోటీలలో జివితేష్ మొదటి స్థానాన్ని సాధించాడు. విజయవాడ నలందా విద్యానికేతన్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్న జివితేష్ జాతీయ పోటీలకు ఎంపికైన విషయాన్ని హ్యాండ్‌రైటింగ్ ట్రైనర్స్ అసోసియేషన్ కార్యదర్శి షేక్ మెహబూబ్ హుస్సేన్ బుధవారం మీడియాకు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ఇటీవల నిర్వహించిన ఒలింపియాడ్‌లో 14 వేలమంది విద్యార్థులు హాజరుకాగా జివితేష్ ప్రథమ స్థానాన్ని సాధించటం గమనార్హం. వచ్చే ఏడాది జరిగే నేషనల్ కాలగ్రఫీ ఒలంపియాడ్ లో 3 లక్షల మంది విద్యార్థులు పోటీలలో పాలు పంచుకోనున్నారు.