డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌లాంటి మహనీయుల స్ఫూర్తితో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి అన్నారు. శనివారం వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 73వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా సర్పంచ్ లలిత, ఎంపీపీ చందా చంద్రమ్మ, జెడ్పిటిసి ఏసీ పార్వతమ్మ, మాజీ ఎంపీపీ ఏసీ ఎర్రిస్వామి, మాజీ జెడ్పిటిసి తిప్పయ్య, ఎస్సి సెల్ రాష్ట్ర నాయకులు బసవరాజు, పట్టణ అధ్యక్షుడు బ్యాంక్ ఓబులేసు, ఉప సర్పంచ్ వన్నప్ప, జిల్లా అధికార ప్రతినిధి వీరన్న ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మాజీ ఎమ్మెల్యే నివాళులర్పించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ దేశ చరిత్రలో ఏ నాయకుడు చేయని విధంగా రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని పండుగలా నిర్వహించేందుకు తమ అధినేత వైయస్ జగన్ పిలుపునిచ్చారని చెప్పారు. రాజ్యాంగం గురించి తెలుసుకునేందుకు ఈ ప్రత్యేక రోజు ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపుతుందని ఆకాంక్షించారు. మనం అంతా గర్వించదగిన రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఆవిశ్రాంతంగా శ్రమించిన గొప్ప మేధావులకు ఘనమైన నివాళి అందించేందుకే ఈ ప్రత్యేక దినం అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కృషిని గుర్తుచేసుకోకుంటే మన రాజ్యాంగం ప్రస్తావనే ఉండదన్నారు. రాజ్యాంగ రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన ఆయనకు వందనం తెలిపారు. మన రాజ్యాంగ విలువలను, సిద్ధాంతాలను గౌరవించాలని విశ్వేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ గోవిందు, ఆర్. కొట్టాల గోపాలకృష్ణ, ఓబన్న, వార్డు సభ్యులు, ఎంపీటీసీలు వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.