అనుమతులు ఒకచోట తవ్వకాలు మరోచోట నిర్వహిస్తూ అక్రమ మైనింగ్ కు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పుత్తా నరసింహారెడ్డి, మైదుకూరు నియోజవర్గ టీడీపీ ఇన్ చార్జి పుట్టా సుధాకర్ యాదవ్ లు డిమాండ్ చేశారు. మంగళవారం చాపాడు మండలం వెదురూరులో జరుగుతున్న అక్రమ మైనింగ్ ను సందర్శించి అక్రమ మైనింగ్ జరిగిన ప్రదేశాన్ని పుత్తా నరసింహారెడ్డి, పుట్టా సుధాకర్ యాదవ్ లు పరిశీలించారు.
పుత్తా నరసింహారెడ్డి, పుట్టా సుధాకర్ యాదవ్ లు మాట్లాడుతూ చాపాడు మండలం వెదురూరు ఇసుక రీచ్ లో సూచించిన హద్దులలో కాకుండా కమలాపురం మండలంలోని సంబటూరు విబారాపురం రెవెన్యూ పొలాలలో అక్రమ మైనింగ్ కు పాల్పడిన ఇసుకక్వారీ నిర్వాహకులపై అక్ర మైనింగ్ కు పాల్పడిన వారికి పూర్తి అండదండలు అందించిన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి అక్రమ మైనింగ్ పాల్పడిన వారిపై, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై విచారణ జరిపి వారిని బాధ్యులుగా చేయాలని డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా తవ్వి డంపు చేసిన ఇసుకను సీజ్ చేయాలన్నారు. అక్రమ మైనింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోకపోగా ఇది అక్రమంగా జరుగుతుందని పోరాటం చేసిన తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు పుత్తా ఎల్లారెడ్డి, రైతు నాయకుడు ప్రభాకర్ రెడ్డి పై పెట్టిన అక్రమ కేసులు తక్షణమే ఎత్తివేయాలని లేని పక్షంలో కమలాపురం, మైదుకూరు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో కమలాపురం, మైదుకూరు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.