రాజధాని అమరావతిని మార్చడం ఎవరి వాళ్ళ కాదని బీజేపీ మాజీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. జనవరి 31 తేదీన అమరావతే రాజధాని అని సుప్రీంకోర్టు ఆదేశాలిస్తుందని న్యాయకోవిధులు చెబుతున్నారని తెలిపారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. కొంతమంది అవగాహన లేకుండా రాజధానిపై మాట్లాడుతున్నారని.. రాజధాని మార్చే అంశంలో అసెంబ్లీకి అధికారం లేదని గతంలో హైకోర్టు చెప్పిందని గుర్తుచేశారు. రాష్ట్రపతి ఆమోదంతో ఏర్పాటైన హైకోర్టు కూడా మారదని తెలిపారు. ముఖ్యమంత్రి మారినప్పుడల్లా రాజధాని మారదన్నారు. అమరావతి రాజధానిగా గతంలో కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేసిందని చెప్పారు. రాజధానిని మార్చాలంటే పార్లమెంటే మార్పులు చేయాల్సి ఉంటుందని, సర్వే ఆఫ్ ఇండియా కూడా అమరావతిని రాజధానిగా గుర్తించిందని వివరించారు. సుప్రీంకోర్టులో జరిగిన వాదనలు బట్టి చూస్తే న్యాయమూర్తులు రాజధానిగా అమరావతికే అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోందని అన్నారు.