టెన్త్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో మాజీ మంత్రి పి.నారాయణ కి మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేస్తూ చిత్తూరు జిల్లా 9వ అదనపు సెషన్స్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ మాజీ మంత్రి పి.నారాయణ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో తీర్పు వెల్లడించేందుకు సమయం పడుతుందని న్యాయమూర్తి జస్టిస్ ఆర్.రఘునందనరావు తెలిపారు. తుది తీర్పు ఇచ్చేవరకు సెషన్స్ కోర్టు ఇచ్చిన గడువును పొడిగిస్తామన్నారు. నారాయణ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. మధ్యంతర ఉత్తర్వులపై పోలీసులు వేసిన రివిజన్ పిటిషన్‌కు విచారణార్హత ఉండదన్నారు. పిటిషనర్ పబ్లిక్ సర్వెంట్ నిర్వచనం కిందకు రారని.. ఈ నేపథ్యంలో పోలీసులు నమోదు చేసిన ఐపీసీ సెక్షన్ 409 ఆయనకు వర్తించదని తెలిపారు.