‘‘వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సున్నా వడ్డీకి అర్హత పొందిన రైతులు నాలుగో వంతుకు తగ్గిపోయారు. దానిని కప్పిపుచ్చుకోవడానికి ఆ పార్టీ మోసపూరితంగా ప్రచారం చేస్తోంది’’ అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం ఆయన ఇక్కడ తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘టీడీపీ హయాంలో 35 లక్షల మంది రైతులు సున్నా వడ్డీకి అర్హత పొందారు. వారికి వడ్డీ రాయితీ కింద రూ.1,719 కోట్లు చెల్లించాం. ఇప్పుడు ఎనిమిది లక్షల మందికి సున్నా వడ్డీ ఇచ్చామని ఈ ప్రభుత్వం చెబుతోంది. అంటే ఈ రాయితీ పొందిన వారి సంఖ్య నాలుగో వంతుకు పడిపోయింది. టీడీపీ హయాంలో రైతులు అసలు చెల్లిస్తే సరిపోయేది. ఇప్పుడు వడ్డీతో సహా రైతులు ముందు చెల్లిస్తే తర్వాత ప్రభుత్వం ఎప్పటికో ఇస్తోంది. ఏవైనా ఇబ్బందులు ఉండి కట్టలేకపోతే ఆ రాయితీని రైతులు కోల్పోతున్నారు. సున్నా వడ్డీ పచ్చి మోసంగా తయారయింది’’ అని సోమిరెడ్డి విమర్శించారు.