దేశంలో ద్రవ్యోల్బణం గరిష్ఠస్థాయిలో కొనసాగుతున్న నేపథ్యంలో వడ్డీ రేట్లను రిజర్వ్‌బ్యాంక్ పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూన్ నుంచి ఇప్పటివరకూ మూడు దఫాలు 50 బేసిస్ పాయింట్ల చొప్పున రేట్లను పెంచిన ఆర్బీఐ మరో 0.35 శాతం రెపో రేటును తాజాగా పెంచుతుందని భావిస్తున్నారు. అంతకు ముందు మే నెలలో హఠాత్తుగా 40 బేసిస్ పాయింట్ల రేట్లను పెంచింది. ఇప్పటివరకూ 190 బేసిస్ పాయింట్లు (1.9 శాతం) రేట్లు పెరిగాయి. రిజర్వ్‌బ్యాంక్ రేట్లను నిర్ణయించే కమిటీ మూడు రోజుల సమావేశం సోమవారం ప్రారంభమైంది. మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) విధానాన్ని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ రేపు వెల్లడిస్తారు.