ఒకవేళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కలిసిపోయే పరిస్థితి వస్తే మోస్ట్ వెల్కమ్ అని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యానారాయణ అన్నారు. రెండు రాష్ట్రాలు కలిసే ప్రతిపాదన వస్తే తప్పేముందని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు మళ్లీ కలిసిపోవడంపై రాష్ట్రంలో జోరుగా చర్చ సాగుతోంది. ఏపీ, తెలంగాణ కలిసిపోవాలని కోరుకుంటున్నట్లు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. సజ్జల కామెంట్స్‌పై తెలంగాణ నాయకులు భగ్గుమంటున్నారు. ఈ క్రమంలో బొత్స సత్యనారాయణ ఈ విషయమై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ మేరకు తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాలు కలిసి ఉండాలనే తాము కోరుకుంటామని.. మొదటి నుంచి ఇదే స్టాండ్‌పై ఉన్నామని స్పష్టం చేశారు. అయితే, ఏపీ విభజన చట్టం ప్రకారం రాష్ట్ర హక్కుల సాధన కోసం తాము పోరాటం చేస్తూనే ఉంటామని తేల్చి చెప్పారు. ఇక, గత టీడీపీ ప్రభుత్వం ఏ విషయంలోనూ ప్రజలకు అండగా నిలవలేదని మంత్రి బొత్స చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు నిలబెట్టుకోలేకపోయారని విమర్శించారు. చంద్రబాబుకు మాటలు తప్ప చేతలు లేవన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పారదర్శకమైన పాలన అందిస్తున్నారని, వైసీపీ ప్రభుత్వ పాలనలో పేద ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని చెప్పారు. అవినీతికి, వివక్షకు తావులేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే సంక్షేమ పథకాల సాయం జమ చేస్తున్నామని చెప్పారు.