రాష్ట్రంలో అఘాయిత్యాలు పెరిగాయని, మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత తెలిపారు. ఏపీలో పరిస్థితిపై పార్లమెంట్‌లో కేంద్రహోంశాఖ నివేదిక వెల్లడించిన నేపథ్యంలో రాష్ట్రహోంమంత్రి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సాలూరులో బుధవారం ఆమె విలేఖర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో రోజురోజుకూ అత్యాచారాలు పెరిగిపోతున్నాయని, హోంమంత్రిగా మహిళ ఉండి ఏ లాభమని ప్రశ్నించారు. సజ్జల చేతిలో కీలుబొమ్మలా ఉండొద్దని, కేవలం ప్రోటోకాల్‌కే పరిమితం కారాదని అన్నారు. కొందరు పోలీసులు వైసీపీకి తొత్తులా పనిచేస్తున్నారని ఆరోపించారు. మాచర్ల సంఘటనే ఇందుకు తార్కాణమన్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలను హౌస్ అరెస్ట్‌లు చేయడానికి, అడ్డుకోవడానికే కొందరు ఎస్పీల నుంచి హోంగార్డులు శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో నేరాల సంఖ్యను తగ్గించడానికి ఆ శ్రద్ధను వినియోగించాలని హితవు పలికారు. సీఎం జగన్ తీరు వల్లే వారి అనుచరులు రెచ్చిపోతున్నారని విమర్శించారు. బాబాయ్‌పై గొడ్డలిపోటు వేసినా గుండెపోటుగా చిత్రీకరించడానికి చూసిన నైజం వారిదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే అనుచరులు సైతం రాష్ట్రంలో ఎక్కడక్కడే కబ్జాలు, అల్లర్లు, హత్యలు, దౌర్జాన్యాలకు పాల్పడుతున్నారన్నారు. సీఎం జగన్ జన్మదిన వేడుకల పేరిట కలెక్షన్లు చేశారని ఆరోపించారు.