తిరుపతి వాసులను చిరుత సంచారం కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. తిరుపతిలోని ఎస్వీ వెటర్నరీ యూనివర్శిటీలో సంచరిస్తున్న చిరుతను పట్టుకునేందుకు అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. కొద్దిరోజుల క్రితం వర్శిటీలోకి చొరబడిన చిరుతలు పెంపుడు కుక్కలను చంపేశాయి. సోమవారం రాత్రి మళ్లీ మూడు చిరుత పులులు విద్యార్థినిల హాస్టల్ సమీపంలో సంచరించినట్లు సీసీ కెమెరాలు రికార్డు అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు తాము హాస్టల్లో ఉండలేమంటూ యూనివర్సిటీ వీసి భవనం వద్ద ధర్నా నిర్వహించారు.
దీంతో రంగంలోకి దిగిన వర్శిటీ అధికారులు చర్యలు చేపట్టారు. చిరుత సంచరిస్తున్న ప్రాంతాల్లో సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎవరూ తిరగొద్దని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫారెస్ట్ సిబ్బంది సహకారంతో చిరుత కోసం రెండు బోన్లు ఏర్పాటు చేశారు. వెటర్నరీ యూనివర్సిటీ, కళాశాలల్లోని పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. చిరుత భయంతో విద్యార్థులు ఇప్పటికే హాస్టళ్లు ఖాళీ చేసి వెళ్లిపోగా.. అధ్యాపకులు, సిబ్బంది భయంభయంగా విధులకు హాజరవుతున్నారు.
గతంలో కూడా వెటర్నరీ యూనివర్సిటీ, ఎస్వీ యూనివర్సిటీ, వేదిక్ యూనివర్సిటీ పరిసరాల్లో చిరుతలు సంచరించాయని స్థానికులు చెప్పారు. ఎస్వీ వెటర్నరీ యూనివర్శిటీలో రెండుసార్లు కుక్కలపై కూడా దాడి చేశాయి. వర్శిటీ మెయిన్ బిల్డింగ్ దగ్గర చిరుత కుక్కలపై దాడి చేయగా.. అప్పట్లో సీసీ ఫుటేజ్ వైరల్ అయ్యింది. ప్రయత్నించింది. ఇప్పుడు మళ్లీ చిరుతలు ప్రత్యక్షం కావడంతో స్థానికులు భయాందోళనలో ఉన్నారు.