బ్రహ్మం గారు ‘కాలజ్ఞానం’లో పలు అంశాలు పేర్కొన్న విషయం తెలిసిందే. ఇదిలావుంటే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని గోకవరంలో వింత దూడ జన్మించింది. 8 కాళ్లతో దూడ జన్మించింది. గోకవరం మండలం మురళీనగర్‌లో రైతు దేవిశెట్టి రత్నాజీ ఇంట్లో ఈ వింత దూడ జన్మించింది. ఈ దూడను చూసేందుకు స్థానికులు, చుట్టుపక్కల గ్రామాల వారు వస్తున్నారు. దూడకు రెండు వెన్నెముకలు, 8 కాళ్లు ఉన్నాయి. తల మాత్రం ఒకటే ఉంది. స్థానిక వెటర్నరీ వైద్యులు దూడను పరిశీలించారు. జన్యుపరమైన లోపాల కారణంగానే ఇలాంటి దూడలు జన్మిస్తాయని తెలిపారు. ఇలాంటి దూడలు ఎక్కువ కాలం బతికే అవకాశం కూడా లేదని చెబుతున్నారు.
అయితే, ఈ ఘటనపై స్థానికంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. బ్రహ్మం గారు ‘కాలజ్ఞానం’లో చెప్పినట్లే జరుగుతోందని పలువురు చర్చించుకుంటున్నారు. పంది కడుపున వింత జీవి పుట్టడం, పంది పిల్లకు ఆవు పాలివ్వడం లాంటి వింత ఘటనల గురించి బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారని గుర్తు చేసుకుంటున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.