భారత రైల్వే విభాగం ప్రయాణికుల కోసం కేవలం 35 పైసలతో రూ.10 లక్షల బీమా అందిస్తోంది. ప్రయాణ సమయంలో ప్రమాదవశాత్తూ ఏదైనా జరిగితే ఐఆర్‌సీటీసీ 'ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ' పేరిట బీమా సదుపాయం కల్పిస్తోంది. ఆన్‌లైన్ లేదా మొబైల్ యాప్ లో రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. విదేశీయులు, ఐదేళ్లలోపు పిల్లలు దీనికి అర్హులు కాదు.
ప్రయాణికుడు మరణించినా లేదా శాశ్వత అంగవైకల్యానికి గురైనా రూ.10 లక్షల బీమా అందిస్తారు. పాక్షిక అంగవైకల్యానికి రూ.7.50 లక్షలు, గాయాలపాలైతే ఆసుపత్రి ఖర్చులకు రూ.2 లక్షలు, ప్రమాదవశాత్తూ ప్రయాణికుడు మరణిస్తే మృతదేహ తరలింపుకు రూ.10,000 ఇస్తారు. ఉగ్రవాద దాడులు, దొంగతనం, దోపిడీ, అల్లర్లు, ప్రమాదవశాత్తూ ప్రయాణికుడు రైలు నుంచి పడిపోవడం, రైళ్లు ఢీకొనడం, పట్టాలు తప్పడం వంటి ప్రమాదాలకు ఈ బీమా వర్తిస్తుంది.
లగేజీ చోరీ, రైలు లేట్ రావడం వల్ల వచ్చే నష్టం, రైలు లేట్ అయినప్పుడు అయ్యే నివాస, భోజన ఖర్చులకు బీమా వర్తించదు. అంతేకాకుండా మనకు నచ్చిన సంస్థ నుంచి ఇన్సూరెన్స్ తీసుకోరాదు. ఐఆర్‌సీటీసీ ఎంపిక చేసిన కొన్ని కంపెనీలు మాత్రమే ఈ బీమా సదుపాయాన్ని అందిస్తున్నాయి.
టికెట్ బుక్ చేసుకునేటప్పుడే ఇన్సూరెన్స్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. వెంటనే మీ మొబైల్, ఇ-మెయిల్ కు మెసేజ్ వస్తుంది. తర్వాత నామినీ డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి ఓ లింక్ ను పంపిస్తారు. క్యాన్సిల్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. ఒకే పీఎన్‌ఆర్ కింద చేసుకునే అన్ని బుకింగ్స్ కు బీమా వర్తిస్తుంది.