డిసెంబర్ 31వతేదీ రాత్రి నూతన సంవత్సరం సందర్భంగా ఎవరైనా మద్యం సేవించి వాహనాల్లో రోడ్లపై తిరిగితే కఠిన చర్యలు తప్పవని తాడిపత్రి డిఎస్పి విఎన్ కే చైతన్య శనివారం పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ పై స్పెషల్ డ్రైవ్ తో పాటు ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రహదారులపై కేక్ కటింగ్ వంటివి నిషేధమన్నారు. అలాగే ఎవరైనా బహి రంగ ప్రదేశాల్లో మద్యం సేవించరాదన్నారు. మోటర్ సైకిల్ కి సైలెన్సర్లు తీసివేసి అధిక శబ్దంతో రోడ్లపై తిరుగుతూ ఇతరులను ఇబ్బంది పెడితే చర్యలు తప్పవన్నారు. వీటితో పాటు బైకు రేస్ రైడింగ్ పై ప్రత్యేక నిఘా వుంచాలని, అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని ఆయన పట్టణ సిఐ ఆనందరావు, రూరల్ సిఐ చిన్నపెద్దయ్య, పట్టణ ఎస్ఐ ధరణిబాబు, రూరల్ ఎస్ఐ గౌస్ కు ఆదేశాలు జారీ చేశారు. నూతన సంవత్సర వేడుకలను ప్రతిఒక్కరు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని ఆయన తెలియచేశారు.