జీవితంలో ఇంత సంతోషం తనకు ఎపుడూ కలగలేదని విశాఖపట్నం జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి అన్నారు. ఇక్కడి మండల పరిషత్ కార్యాలయ భవనంలో శుక్రవారం నిర్వహించిన విముక్తి కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత మద్యాన్ని తాగడం మానివేసిన 17 మందితో పాటు వారి కుటుంబ సభ్యులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, ఆశా, అంగన్‌వాడీ, మహిళా పోలీసులతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మద్యం మానివేసిన తర్వాత తమ కుటుంబాల్లో వచ్చిన మార్పులను మహిళలు వివరిస్తుంటే.. ఆమె ఆసక్తిగా.. ఆనందంగా.. విని చప్పట్లతో అభినందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మద్యం మహమ్మారి చాలా కుటుంబాలను కబళిస్తుందన్నారు. సమాజానికి ఏదైనా మేలు చేయాలనే సంకల్పంతో మద్యపాన నిర్మూలనకు ‘విముక్తి’ కార్యక్రమానికి అక్టోబర్ 2వ తేదీన శ్రీకారం చుట్టామన్నారు. ముందుగా మునగపాక మండలంలో 50 కుటుంబాలను లక్ష్యంగా చేసుకున్నామని, ఇందులో 17 కుటుంబాలు మద్యం కోరల నుంచి బయటపడడం గొప్ప విషయమని ఆమె పేర్కొన్నారు. తాను పర్యవేక్షణ మాత్రమే చేశానని, క్షేత్రస్థాయిలో ఆశా, అంగన్‌వాడీ, మహిళా పోలీసుల కృషి ఇందుకు ప్రధాన కారణమని ప్రశంసించారు. మద్యం పూర్తిగా మానివేసిన కుటుంబాలకు ఎంపీపీ మళ్ల జయలక్ష్మి తన సొంత నిధులతో ప్రెషర్ కుక్కర్లను జేసీ చేతుల మీదుగా పంపిణీ చేయించారు. ఎంపీడీవో రవికుమార్, తహసీల్దార్ బాబ్జీ, డాక్టర్ కృష్ణ, ఈవోపీఆర్‌డీ ఈశ్వరరావు, ఆడారి గణపతి అచ్చయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు.