మత్స్యకారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఫిష్(హబ్)ఆంధ్రా అభాసుపాలవుతోంది. రోడ్‌సైడ్ చేపల వ్యాపారం వల్ల తక్కువ లాభాలుం టాయని, అదే ఫిష్ ఆంధ్రా షాపుల ఏర్పాటుతో బాగా గిట్టుబాటవుతుందని అధికారులు ఊరించారు. నాణ్యమైన చేపలు, శుభ్రంగా అందించడం వల్ల వినియోగదారులను తమవైపు తిప్పుకోవచ్చని పలు సమావేశాల్లో మత్స్యకారులు, ఔత్సాహికులను ఉత్సాహపరిచారు. పైగా సీఫుడ్(సముద్ర తీర ప్రాంతాల్లో లభించే పలు రకాల చేపలు)ను ఆ షాపులకు అందిస్తామని చెప్పారు. రూ. 30వేలు బ్యాంకులో డీడీ తీస్తే మిగిలిన రూ. 1.70 లక్షలు తామే భరించి ఫ్రిజ్, చేపలను వండేందుకు గ్యాస్‌స్టౌ, బతికిన చేపలను చూపించేందుకు నీటితొట్టె తదితర పరికరాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. షాపు వరకూ అన్నీ సమకూర్చారు కానీ చేపల విషయంలోనే తేడా కొట్టింది. నెలరోజులు కూడా ఆ షాపులకు చేపలను సరఫరా చేయలేకపోయారన్న విమర్శలు మూటగట్టుకున్నారు. బయటి మార్కెట్లో కట్ల, రోహు చేపలు కిలో రూ. 100 నుంచి రూ. 105 వరకూ ధర పలుకుతోంది. ఇచ్చిన హామీ ప్రకారం అధికారులు రూ. 10లు తక్కువ ధర కు ఇవ్వాల్సి ఉంది. అయితే హబ్ ప్రమోటర్లు మాత్రం రవాణా తదితర ఖర్చుల నేపథ్యంలో... కేజీ చేపలు రూ. 120కి ఇచ్చేందుకు ముందుకొచ్చారు. దీంతో పలువురు మత్స్యకారులు హబ్ ప్రమోటర్ల ధరలకు చేపలు కొనలేక బయటి నుంచి కొని, అమ్ముకుంటున్నారు. దీంతో ఫిష్ ఆంధ్రా పేరుతో రిటైల్‌షాపుల్లో ఏర్పాటు చేసిన ఫ్రిజ్, చేపలను వండేందుకు గ్యాస్‌స్టౌ, బతికిన చేపలను చూపించేందుకు నీటితొట్టె తదితర సామగ్రి మొత్తం వృథా అయ్యాయి. ఫిష్ హబ్ ఏర్పాటుకు ముందుకొచ్చిన అంజన అనే పారిశ్రామికవేత్త సంవత్సరం గడుస్తున్నా ఫిష్ ఆంధ్రాషాపుల్లో పురోగతి లేకపోవడంతో హబ్ ఏర్పాటు బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు సమాచారం. హబ్ లేకపోతే ఫిష్‌ఆంధ్రాలు నడవడం సాధ్యం కాదు. దీంతో ఆ శాఖ అధికారులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.