పుట్టపర్తి జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ పి. బసంత్ కుమార్ ఆదేశించారు. బుధవారం ఉదయం కలెక్టరేట్ లోని తన చాంబర్ లో రవాణా, పోలీస్, మెడికల్, మున్సిపల్, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ తదితర శాఖ అధికారులతో జిల్లాస్థాయి రోడ్డు సేఫ్టీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గత డిసెంబర్ మాసంలో రోడ్డు ప్రమాదాల నివారణకై తీసుకున్న చర్యలు మరియు సాధించిన ప్రగతిపై సమీక్షించి దిశ నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈనెల 18 నుండి 24 వరకు రవాణా శాఖ ఆధ్వర్యంలో వారంరోజుల పాటు జాతీయ రహదారి భద్రత వారోత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఆయా కార్యక్రమాలను జయప్రదం చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమన్నారు. ప్రజలు కూడా రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధించిన ప్రభుత్వ సూచనలపై అవగాహన కలిగి తూ. చ. తప్పకుండా పాటించాలన్నారు. అలాగే అన్ని స్థాయిలలో సంబంధిత శాఖ అధికారులు సమన్వయంతో పటిష్ట చర్యలతో పాటు ప్రజల్లో విస్తృతంగా అవగాహన చైతన్య కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. మరి ముఖ్యంగా తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యాలు ఈ అంశంపై పూర్తిగా బాధ్యత తీసుకోవాలని సూచించారు. రోజు రోజుకి పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను, మరణాలను తగ్గించుటకు క్షేత్ర స్థాయిలో గ్రామాలు, మండలాల వారిగా సంబంధిత అధికారులు సమన్వయంతో భద్రతా లోపాలుగల ప్రాంతాలను గుర్తించి వాటి నివారణకు తీసుకోవలసిన చర్యలపై ఒక సమగ్ర ప్రణాళిక తయారు చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో చేయగలిగిన మరమ్మతులు చర్యలు చేపట్టి జిల్లా కార్యస్థానానికి నివేదిస్తే వాటిపై సంబందిత నేషనల్ హైవేస్, ఆర్&బి, ఇంజనీరింగ్ తదితర సంబందిత అధికారులతో సమీక్షించి వాటి అమలుకు ఒక కమిటీ ఏర్పాటు చేయుటకు సత్వర చర్యలు చేపడుతామని అన్నారు. మునిసిపల్, పంచాయతీ అధికారులు రోడ్లపై ఏర్పడ్డ గుంతలను గుర్తించి వెంటనే మరమ్మతులు చేసే విధంగా ఉండాలని అవసరమున్న చోట విద్యుత్ దీపాల ఏర్పాటు చేయాలని సూచించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గుడ్ సమారిటన్ స్కీం కింద ఎవరైనా రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి సకాలంలో గోల్డెన్ హవర్ లో ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేసి ఆసుపత్రులకు తరలించిన వారికి ప్రోత్సాహకంగా రూ. 5 వేలు అందించబడుతుందని, ప్రతి పౌరుడు భాద్యతతో వ్యవహరించి ప్రమాద బాధితులకు అండగా నిలవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఇలాంటి గుడ్ సమారిటన్ ల వివరాలను పోలీసులు నిర్బందించి తీసుకోవడానికి కోర్టుకు రావాలని ఇబ్బంది పెట్టడం జరగదని అన్నారు. పోలీసులు తదనుగుణంగా వ్యవహరించాలని సూచించారు. క్షతగాత్రులను చేర్చిన ఆసుపత్రులలో ప్రమాద బాధితుల వివరాలు కేంద్ర ప్రభుత్వం ఎన్. ఐ. సి వరి ఐరాడ్(IRAD) యాప్ లో నమోదు చేయడం ద్వారా జాతీయ స్థాయి వరకు ఈ వివరాలు అందుబాటులో ఖచ్చితత్వంతో ఉంటాయని, సంబందిత డాక్టర్ లు దీనిపై పూర్తి అవగాహనతో ఉండాలని తెలిపారు. గత ఏడాది డిసెంబర్ వరకు జిల్లాలో మొత్తం 44 ప్రమాదాలు జరగగా, అందులో 30 మంది మృతి చెందారని, 71 మంది గాయపడినట్లు మరియు 15 శాతం దాకా గుర్తించిన బ్లాక్ స్పాట్లలో ప్రమాదాలు జరుగుతున్నట్లు రవాణా శాఖ నివేదిక ద్వారా తనకు తెలియ వచ్చిందన్నారు. ముఖ్యంగా జాతీయ రహదారుల్లో వాహనాల పార్కింగ్ పై దృష్టి పెట్టాలని, ఎలాంటి అనుమతులు లేకుండా రహదారుల్లో ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్లను గుర్తించడంతో పాటు రోడ్లను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకొని రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
దేశంలోనే రహదారులు నిత్యం రక్తసిక్తం అవుతూనే ఉన్నాయని, వాహనం అదుపు తప్పడం, మాట్లాడుతూ నడపడం, హెల్మెట్ ధరించకపోవడం, కార్లలో సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో పాటు రహదారి నిబంధనలను పాటించకపోవడం ఇందుకు ప్రధాన కారణం అని తెలిపారు. రహదారి ప్రమాదాలు ఎక్కువగా మధ్యాహ్నం మూడు నుండి రాత్రి 9 గంటల మధ్యన చోటు చేసుకుంటున్నట్లు అనేక నివేదికలు వెల్లడిస్తున్నాయన్నారు. అందువల్ల వాహన చోదకులు ఎల్లప్పుడూ మానసిక, శారీరక పటుత్వం మరియు వాహనంపై నియంత్రణ కలిగి ఉండాలని, తన వాహనం యొక్క కనీస పరిజ్ఞానం తెలుసుకొని వాహనాలు నడుపుకోవచ్చునని సూచించారు. అలాగే ప్రయాణికుల భద్రతకు భంగం కలగకుండా ఓర్పుతో, ఏకాగ్రతతో, నిబద్ధతతో ఇతర రోడ్డు వినియోగదారుల పట్ల కూడా బాధ్యతతో ఎలాంటి హాని తలపెట్టకుండా తమ తమ ప్రయాణాలు చేపట్టినట్లయితే ఎక్కువ సంఖ్యలో రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చునని తెలిపారు. అనంతరం ప్రజలకు అవగాహన చైతన్యం కలిగే విధంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణకై రూపొందించిన పోస్టర్లు, బ్యానర్లు, కరపత్రాల ప్రచార సామాగ్రిని జిల్లా కలెక్టర్ ఆవిష్కరించి విడుదల చేశారు. ఈ సమావేశంలో ఏఎస్ పి రామకృష్ణ, డిటిసి కరుణ సాగర్ రెడ్డి, డియంహెచ్ఓ డా. ఎస్. వి. కృష్ణారెడ్డి, ఆర్టీసీ డిఎం ఇనాయతుల్లా, ఎస్ ఈ ఆర్ అండ్ బి సంజీవయ్య, ఎంవిఐలు సివి రమణ, శివశంకర్, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.