తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ‘యువగళం’ పేరుతో కుప్పంనుంచి ప్రారంభించనున్న పాదయాత్ర ఒక చరిత్రగా నిలవనుందని మాజీ మంత్రి అమరనాథరెడ్డి అన్నారు. జగన్‌రెడ్డి పాలనలో నష్టపోయిన యువతతోపాటు అన్ని వర్గాల తరపున ఆయన నిలదీస్తారన్నారు. వైసీపీ అరాచకాలపై లోకేశ్ సమరశంఖం పూరిస్తారని చెప్పారు. పాదయాత్రను ఈనెల 27న కుప్పంనుంచి ప్రారంభించనున్న నేపథ్యంలో ఆ యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ టీడీపీ శ్రేణులు శుక్రవారం నియోజకవర్గ వ్యాప్తంగా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజల్లో పాల్గొన్న అమరనాథరెడ్డి, అనంతరం లోకేశ్ పాల్గొననున్న బహిరంగ సభావేదిక స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. వారంలో రెండు రోజులు జైలుకెళ్లి వచ్చి పాదయాత్ర చేసిన నాయకులను గతంలో చూశామన్నారు. లోకేశ్ పాదయాత్ర అలాంటిది కాదన్నారు. వారంలో ఏడు రోజులపాటు నిర్విరామంగా పాదయాత్ర చేయాలనుకోవడం సాహసోపేతమైన చర్యగా అభివర్ణించారు. లోకేశ్ పాదయాత్ర అనుమతికోసం ఇప్పటికే ప్రభుత్వానికి, అధికారులకు విన్నవించామన్నారు. మళ్లీ తమ పార్టీ సీనియర్ నేతలు డీజీపీని కలిసి లేఖ ఇస్తారన్నారు. వీలైనంత త్వరలో అనుమతిస్తే ఏర్పాట్లు చేసుకుంటామని చెప్పారు. ఒకవేళ అనుమతి ఇవ్వకుంటే న్యాయ పోరాటానికి సిద్ధమని ప్రకటించారు. ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ చేసిన అరాచకాలు చూశాం. ఇక టీడీపీ కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ భయపడే ప్రసక్తే లేదు. అరాచకాల తీవ్రతను ప్రజలతో మమేకమై వారికి తెలియజెప్పడానికి, చైతన్యం రగిలించడానికి లోకేశ్ నడుం బిగించారు’ అన్నారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా, సొంత నియోజకవర్గంనుంచి పాదయాత్ర మొదలు పెడుతుండడం శుభపరిణామమన్నారు. అప్పట్లో తెలుగు జాతికి కీర్తితెచ్చింది ఎన్టీఆర్ అని, తర్వాత రాష్ట్రానికి దిశానిర్దేశం చేసి ప్రపంచస్థాయిలో పేరుప్రతిష్ఠలను చంద్రబాబు సంపాదించి పెట్టారన్నారు. అలాంటి మహోన్నతులైన తండ్రితాతల వారసత్వాన్ని అందిపుచ్చుకున్న లోకేశ్, తమకోసం చేడుతున్న పాదయాత్రకు భారీ ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జి పీఎస్ మునిరత్నం తదితరులు పాల్గొన్నారు.