ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాకి ఓ ప్రత్యేకత వుంది. దేశంలోనే మూడు ప్రత్యేకమైన పుణ్యక్షేత్రాలు అయినా కాణిపాకం వరసిద్ధి వినాయకుడు, కాళహస్తిలోని వాయులింగ క్షేత్రం, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఈ జిల్లాలో ఉన్నాయి. ఈ కారణంతోనే రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ బస్సులను తిరుపతి నుంచి ప్రారంభించింది.
ఏపీఎస్ఆర్టీసీ నూతనంగా ప్రవేశపెట్టిన విద్యుత్ ఏసీ బస్సులకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఓ వైపు ప్రయాణీకులకు కాలుష్య, శబ్ద రహిత, సౌకర్యవంతమైన ప్రయాణం ఇస్తూ.. మరోవైపు సంస్థకు ఆదాయం సమకూర్చడంలోనూ, ఖర్చును తగ్గించడంలో ఈ బస్సులు ముందువరుసలో నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ అధికారులు ఈ ఎలక్ట్రిక బస్సులపై ఫోకస్ పెట్టారు.
తొలి విడతగా వచ్చిన పది బస్సులు ప్రస్తుతం తిరుమల - తిరుపతి మార్గంలో పరుగులు పెడుతుండగా.. వీటి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మొత్తం 100 రావాల్సి ఉండగా అలిపిరి డిపోలో వీటి సంఖ్య 62కి చేరుకుంది. తిరుపతి, తిరుమల దారిలో ఇరవై బస్సులను కేటాయించి భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. మిగిలిన బస్సు లకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే తిరుపతి - నెల్లూరు మధ్య 12బస్సులు , తిరుపతి - కడప మధ్య 12బస్సులు, తిరుపతి - మదనపల్లి మధ్య 12 బస్సులు, రేణిగుంట విమానాశ్రయం - తిరుమల మధ్య 14 బస్సులు నడపనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
తొలివిడతగా ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ బస్సులు ఇప్పటికే సుమారు 20వేల కిలోమీటర్ల వేర తిరిగాయి. సాధారణంగా తిరుమల దారిలో డీజిల్ బస్సుకు కిలోమీటర్‌కి 71 రూపాయల ఆదాయం తీసుకొస్తుండగా.. ఎలక్ట్రిక్ బస్సులు 104 రూపాయలు తీసుకురావడం విశేషం. ఆధునిక టెక్నాలజీతో తయారుచేసిన ఈ బస్సులు మూడుగంటలు పూర్తి ఛార్జింగ్‌తో 180 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. కిలోమీటర్ ప్రయాణం కోసం ఒక యూనిట్ మాత్రమే ఖర్చు అయ్యే అవకాశం ఉంది. దీంతో డిజల్ బస్సుల స్థానంలో క్రమంగా విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టేందుకు ఏపీఎస్ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో 2030 నాటికీ 50 శాతం ఎలక్ట్రిక్ బస్సులు నడిపే విధంగా చర్యలు తీసుకుంటోంది.