ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఐడీ చీఫ్‌గా పీవీ సునీల్ కుమార్‌ను తప్పించి...మంచి పనిచేశారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 25, 2023, 12:34 PM

ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న మంచి నిర్ణయం ఏదైనా ఒకటి ఉంది అంటే.. అది సీఐడీ చీఫ్‌గా పీవీ సునీల్ కుమార్‌ను తప్పించడమేనని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు అన్నారు. ఏపీలో అక్రమ వసూళ్ల వ్యవహారంలో ఒక బాధ్యత కలిగిన ప్రజా ప్రతినిధిగా బహిరంగంగానే ఫిర్యాదు చేస్తున్నాను అన్నారు ఎంపీ రఘురామకృష్ణ రాజు. దీనిపై విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధికారుల్లో రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరించిన ఆ ముగ్గురు ఎవరన్నారు. బలవంతపు అక్రమ వసూళ్లకు పాల్పడిన సంఘటనలపై ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే విచారణ జరిపిస్తామన్నారు. దీనిపై ఈ ప్రభుత్వమే విచారణ జరిపిస్తే మంచి పేరు వస్తుందని.. లేకపోతే రాష్ట్రంలో నూతనంగా ఏర్పడనున్న కొత్త ప్రభుత్వానికి ఆ పేరు ప్రతిష్టలు దక్కుతాయన్నారు. 


రాష్ట్ర ప్రభుత్వానికి అధిపతి గవర్నర్.. అటువంటి గవర్నర్‌ను ఉద్యోగ సంఘాల నాయకుకు కలిస్తే తప్పేముందని ప్రశ్నించారు. గవర్నర్‌ని కలిసి ప్రతి నెల ఒకటవ తేదీన జీతాలు ఇప్పించమని ఉద్యోగ సంఘాల నాయకులు అడిగితే తప్పా అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు టిఏలు, డీఏల రూపంలో 18 వేల కోట్ల రూపాయల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించవలసి ఉందని.. ఇదే విషయాన్ని ఉద్యోగ సంఘాల నాయకుడు సూర్యనారాయణ తమ బృందంతో కలిసి గవర్నర్‌కు విన్నవించారని అన్నారు.


అలాగే జీతాలు ప్రతినెలా ఆలస్యం అవుతున్నాయని.. ఒకటవ తేదీన ఇప్పించే విధంగా చొరవ తీసుకోవాలని గవర్నర్‌ను కోరినట్లు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ చెప్పారన్నారు. కానీ అదేదో పెద్ద పాపమైనట్లుగా మరో ఉద్యోగ సంఘం నేతతో ఆయన్ని తిట్టించడమే కాకుండా.. సర్వీస్ రూల్స్ కు భిన్నంగా వ్యవహరించారని చెబుతూ తమ సంఘాన్ని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ నోటీసులు జారీ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ విషయమై ఉద్యోగ సంఘాల నాయకులు కోర్టును ఆశ్రయించే అవకాశాలు కూడా లేకపోలేదన్నారు.


రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన చీకటి జీవో 1 ని కోర్టు కొట్టి వేయడం ఖాయమన్నారు రఘురామ. ఈ జీవోను కోర్టు కొట్టి వేస్తుందని తెలిసే తమ ప్రభుత్వం మాట మార్చిందని.. పోలీస్ చట్టం 32 ప్రకారం సభలు సమావేశాల నిర్వహణకు ముందస్తుగా దరఖాస్తు చేసుకోవాలని మాత్రమే జీవో నెంబర్ 1 లో సూచించామని అడ్వకేట్ జనరల్ వాదించడం ప్రభుత్వ వైఖరిని తేట తెల్లం చేస్తోందన్నారు. అయితే జీవోలో మాత్రం ప్రత్యేక పరిస్థితుల్లోనే సభలో సమావేశాల నిర్వహణకు అనుమతి ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారని తెలిపారు.


ప్రతిపక్ష పార్టీలకు ప్రత్యేక పరిస్థితులు అనేవి ఎప్పటికీ ఉండవనేది పాలకుల భావన అని.. అధికారపక్షం నాయకులు రోడ్లపై తాగి తందనాలు ఆడినా వారికి అనుమతిని ఇస్తారన్నారు. పోలీస్ చట్టం 1861 ప్రకారం ఇచ్చినట్లుగా చెబుతున్న జీవో నెంబర్ 1 నూటికి నూరుపాళ్ళు చీకటి జీవో అన్నారు. ఇది అసంబద్ధమైన రాజ్యాంగ వ్యతిరేక జీవో అని.. దీనిని కోర్టు కొట్టి వేయడం ఖాయమని.. ఒకవేళ హైకోర్టు ఈ జీవోను కొట్టి వేయకపోతే, సుప్రీం కోర్టును ఆశ్రయించి అయినా సరే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటామన్నారు.


మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాదుకు బదిలీ చేసిన తర్వాత కదలిక వచ్చిందన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ లో ఈ కేసు విచారణ చేసినప్పుడు సీబీఐ అధికారులపైనే రాష్ట్ర పోలీసులు కేసులు నమోదు చేశారన్నారు. హత్య కేసు విచారణ నత్త నడకనసాగడంతో సునీతా రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించి కేసును పొరుగు రాష్ట్రాలకు బదిలీ చేయమని కోరిన విషయం తెలిసిందేనని అన్నారు. చాలామందిని ప్రశ్నించిన తర్వాతే ఇప్పుడు అవినాష్‌ రెడ్డిని కూడా విచారణకు పిలిచారన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com