మూగ జీవాలకు మెరుగైన వైద్య సేవలందించే లక్ష్యంతో రెండో దశలో భాగంగా రూ. 112.62 కోట్లతో 165 డా. వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవ అంబులెన్సులు (మొబైల్ అంబులేటరీ క్లినిక్స్) ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ వాహనాలను ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 175 నియోజకవర్గాల్లో ఒక్కొక్కటి చొప్పున రూ.129.07 కోట్లతో 175 వాహనాలను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరో రూ.111.62 కోట్లతో 165 వాహనాలు ప్రారంభమయ్యాయి.
మూగ జీవాల కోసం ప్రత్యేకంగా ఈ అంబులెన్సుల్ని తీసుకొచ్చారు. ఈ అంబులెన్స్‌లో పశు వైద్యుడు, వెటర్నరీ డిప్లొమా సహాయకుడు, డ్రైవర్ కమ్ అటెండర్లను అందుబాటులో ఉంటారు. అంతేకాదు ప్రతి వాహనంలో 81 రకాల మందులు అందుబాటులో ఉంటాయి. అంబులెన్సుల్లో 54 రకాల అత్యాధునిక పరికరాలతో పాటు వెయ్యి కిలోల బరువు ఎత్తగలిగే హైడ్రాలిక్ లిఫ్ట్ సౌకర్యం ఉంది. ఈ అంబులెన్స్‌ల కోసం 1962 కాల్ సెంటర్‌తో పాటుగా సమీకృత కాల్ సెంటర్ 155251ను కూడా అందుబాటులో ఉంటుంది. ఈ నంబర్లను సంప్రదించి అంబులెన్స్ సేవల్ని అవసరమైనవారు ఉపయోగించుకోవచ్చు.
ఈ వాహనాల నిర్వహణ బాధ్యతలను జీవీకే–ఈఎంఆర్‌ఐకు అప్పగించారు. ఇప్పటికే 175 వాహనాలు సేవలు అందిస్తున్నాయి. 2,250 ఆర్బీకేల పరిధిలో 4 వేల గ్రామాల్లో 1.85 లక్షల జీవాలకు వైద్య సేవలందించాయి. కాల్ సెంటర్‌కు రోజుకు సగటున 1,500 చొప్పున 8 నెలల్లో 3.75 లక్షల ఫోన్‌కాల్స్ వచ్చాయి.. ఒక్కో వాహనం రోజుకు సగటున 120 కిలోమీటర్లకు పైగా వెళ్లి వైద్య సేవలు అందిస్తోంది.