ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ వివిధ పార్టీలు తమ బలాబలాలపై లెక్కలు వేసుకుంటున్నారు. తెలుగు దేశం, జనసేన పొత్తు సాగితే ఎలాంటి పరి ణామాలు చోటు చేసుకుంటాయి ? బీజేపీ, జనసేన కలిసి నడిస్తే వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి ? అనే దానిపై తర్జనభర్జన సాగుతోంది. ఏలూరు జిల్లాలోని ఏడు నియోజక వర్గాల పరిధిలో జనసేన కొన్నిచోట్ల కేడర్ బలంగానే ఉన్నప్ప టికీ పలుచోట్ల నియోజకవర్గ ఇన్‌చార్జిలు లేని లోటు ఉంది. కైకలూరు, నూజివీడు, పోలవరం, దెందులూరు వంటి నియోజక వర్గాలకు ఇప్పటికి ఇన్‌చార్జిలంటూ ఎవరూ లేరు. ఉమ్మడి పశ్చిమ గోదావరిలో జిల్లా నాయకత్వం కిందే ఇక్కడ పార్టీ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బలంగా ఉన్న కేడర్‌కు దిశ, దశ నిర్ధేశం చేయాల్సిన నాయకత్వం లోటు పార్టీలో ఒకింత అలజడికి దారి తీస్తోంది. ఎన్నికల పొత్తు విషయానికి వచ్చే సరికి కొంత సస్పెన్స్‌తోనే కేడర్ ఉంది. ఈ మధ్యన భీమవరంలో సాగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో తాము వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ పొత్తు జనసేనతోనేనని బీజేపీ తేల్చి చెప్పేసింది. ఈ తరుణంలో టీడీపీ సైతం చివరి క్షణాల్లో ఎన్నికల పొత్తు టీడీపీ–జనసేన మధ్య ఉంటుందని అంటూ ఆ పార్టీ నేతలు విశ్లేషిస్తూ వస్తున్నారు.