మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలో సముద్ర తీరాన్ని నాలుగుచోట్ల ఆర్కే బీచ్ తరహాలో అభివృద్ధి చేయనున్నట్టు జీవీఎంసీ కమిషనర్ పి.రాజాబాబు తెలిపారు. ఆయన తన ఛాంబర్‌లో విలేకరులతో మాట్లాడుతూ జీ-20 సదస్సుకు చేస్తున్న ఏర్పాట్లలో భాగంగా ఆర్కే బీచ్ పరిసర ప్రాంతాలను సుందరీకరిస్తున్నామన్నారు. అదే తరహాలో జోడుగుళ్లపాలెం, సాగర్‌నగర్, తొట్లకొండ, మంగమారిపేట ప్రాంతాల్లో బీచ్‌లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఆయాచోట్ల సందర్శకులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు తినుబండారాలు అందుబాటులో వుండేలా చర్యలు తీసుకుంటామని కమిషనర్ చెప్పారు. ఆర్కే బీచ్‌కు సందర్శకుల తాకిడి పెరిగినందున మరో నాలుగుచోట్ల బీచ్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించామన్నారు. కొత్తగా అభివృద్ధి చేస్తున్న నాలుగు చోట్ల ఎల్‌ఈడీ లైటింగ్, టాటా సంస్థ అభివృద్ధి చేసిన పర్యావరణహితమైన ఫైబర్ మరుగుదొడ్లను ఏర్పాటుచేస్తామన్నారు. అలాగే ఆ నాలుగు బీచ్‌ల వద్ద భారీ ఎల్‌ఈడీ స్ర్కీన్‌లు ఏర్పాటు చేస్తామని కమిషనర్ తెలిపారు. ఆర్కే బీచ్‌లో జరిగే ఎలాంటి కార్యక్రమమైనా అక్కడ కూడా కనిపించేలా చూస్తామన్నారు. రాత్రిపూట సందర్శకులకు ఆహ్లాదం కలిగించేందుకు మ్యూజికల్ లైటింగ్ కూడా అందుబాటులోకి తెస్తామన్నారు.