ఏలూరు జిల్లా, పోలవరం మండలం ఏజెన్సీలో సాగులోవున్న భూములపై గిరిజనులకు యాజమాన్య హక్కులు కల్పించాలని, ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని ఏజెన్సీ గిరిజన రైతు సంఘం, రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో రైతులు ఏలూరులో కదం తొక్కారు. ప్రదర్శనగా ప్రజా కళాకారులు పాటలు పాడుతూ ర్యాలీగా కలెక్టరేట్ వద్దకు చేరుకుని ధర్నా చేశారు. వ్యవసాయ శాఖ మాజీ మంత్రి, రైతు సంఘాల సమన్వయ కమిటీ కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడారు. పోలవరం మండలంలో అన్యాక్రాంతమైన తమ భూములు తిరిగి స్వాధీన పర్చుకుని 30 ఏళ్ళుగా సాగు చేసుకుంటున్నారని ఆ భూములకు హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. రైతుల కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సింహాద్రి ఝాన్సీ మాట్లాడుతూ... భూములకు యాజమాన్య హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం జేసీని కలిసి వినతిపత్రం అందించారు. రైతు కూలీ సంఘం రాష్ట్ర సభ్యులు షేక్ బాషా, వెంకటేశ్వర్లు, డివర్మ, నాగేశ్వరరావు, వేట్ల విజయ పాల్గొన్నారు.