బందరు ఎంపీ వల్లభనేని బాలశౌరి అనుచరుడు శివపై జరిగిన దాడి కేసులో ఆదివారం అర్థరాత్రి నుంచి అవనిగడ్డ పోలీస్ స్టేషన్‌లో హైడ్రామా నెలకొంది. పోలీసు ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలతో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రేపల్లె దామోదర్, చింతలపూడి పిచ్చేశ్వరరావుతో పాటు మరో ఇద్దరిని అవనిగడ్డ, చల్లపల్లి సీఐలు అదుపులోకి తీసుకుని తొలుత అవనిగడ్డ పోలీస్ స్టేషన్‌కు, ఆ తర్వాత మచిలీపట్నానికి తరలించారు. ఈ కేసులో ఏడేళ్లలోపు శిక్షపడే సెక్షన్లు ఉండటంతో పోలీసులు అదుపులోకి తీసుకున్న నలుగురిని అవనిగడ్డ పోలీస్ స్టేషన్‌లోనే ఉంచి నోటీసులు ఇచ్చాక స్టేషన్ బెయిల్‌పై విడుదల చేస్తారని భావించగా, పోలీసులు స్థానికంగా శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందనే అనుమానంతో మచిలీపట్నం తరలించారు. తమ అనుచరులు ఎక్కడంటూ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు పోలీసులను నిలదీయటంతో పాటు జిల్లా, రాష్ట్ర ఉన్నతాధికారులతో కూడా ఫోన్‌లో మాట్లాడించారు. మచిలీపట్నం, గుడివాడకు చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు బెయిల్ కోసం ఒత్తిడి తెచ్చారు. దీంతో నిందితులను తిరిగి అవనిగడ్డకు తీసుకొచ్చి, సంతకాలు తీసుకుని వదిలేసినట్టు సమాచారం.