‘ప్రపంచం మొత్తానికి నేను ప్రేరణగా నిలిచి ఉండవచ్చు.. కానీ, ఈ ప్రాంతం నాకు ఎంతో ప్రేరణనిచ్చింది’ అంటూ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థినులు ఆంగ్లంలో మాట్లాడుతున్న తీరు.. అందులో స్పష్టత, వారు అడుగుతున్న ప్రశ్నలకు అంతర్జాతీయ మోటివేషనల్ స్పీకర్ నిక్ ఉజిసిక్ మంత్రముగ్ధులయ్యారు. నేను ప్రపంచవ్యాప్తంగా 78 దేశాలలో పర్యటించా. కానీ ఏ దేశంలో లేని అనుభూతి, ప్రత్యేకతను నేను గుంటూరులో పొందానని చెప్పారు. గుంటూరు నగరంలోని చౌత్రా సెంటర్‌లో ఉన్న ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలను నిక్ ఉజిసిక్ సందర్శించారు. ఈ సందర్భంగా 10వ తరగతి విద్యార్థినులకు లక్ష్యసాధన, దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థినులతో ముఖాముఖీగా మాట్లాడారు. ఆ తర్వాత సాయంత్రం బీఆర్ స్టేడియంలో ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలతో పాటు నగరంలోని వివిధ మున్సిపల్ ఉన్నత పాఠశాలల నుంచి వచ్చిన వేలాది మంది టెన్త్ విద్యార్థులనుద్దేశించి చేసిన ప్రసంగంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పులు, చేపడుతున్న కార్యక్రమాలపై మరోమారు ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. ఎంతో అంకితభావం ఉన్న ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఉండటం అభినందనీయమంటూ సీఎం వైయస్ జగన్కు కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు.