గుంటూరులో రూ.1.30 కోట్లతో నిర్మించిన ఔషధ నియంత్రణ, పరిపాలన శాఖ ఉపసంచాలకుల కార్యాలయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని ప్రారంభించారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా నిర్మించిన 12 ఔషధ నియంత్రణ కార్యాలయాలను అక్కడి నుంచే వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని మాట్లాడుతూ.. ఔషధ నియంత్రణ, పరిపాలన శాఖకు రాష్ట్రవ్యాప్తంగా తొలిసారి 27 నూతన భవనాలు నిర్మిస్తున్నామని, తొలివిడతగా రూ.6.50 కోట్లతో నిర్మాణం పూర్తయిన 12 భవనాలను ప్రారంభించామని తెలిపారు. నకిలీ మందులు, కాలం చెల్లిన మందులు మార్కెట్‌లో లేకుండా చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్, జెడ్పీ చైర్మన్ కత్తెర హెని క్రిస్టినా, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఔషధ నియంత్రణ, పరిపాలన శాఖ డైరెక్టర్ జనరల్ ఎస్.రవిశంకర్ నారాయణ్, డైరెక్టర్ ఎంబీఆర్ ప్రసాద్, కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డి, ఔషధ నియంత్రణ శాఖ డిప్యూటీ డైరెక్టర్ డి. లక్ష్మణ్ పాల్గొన్నారు.