కేంద్ర బడ్జెట్ 2023ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంటులో సమర్పించారు. దీనిని 'అమృత్ కాల్' బడ్జెట్‌గా అభివర్ణించారు. ఈ బడ్జెట్‌లో విద్యకు, ఉపాధి పెంపునకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రకటించారు. యువతలో ప్రతిభ అన్వేషించడం, పర్యాటకంతో పాటు ఈవీ సెగ్మెంట్‌లలో ఉద్యోగాలను కల్పించడం తమ ప్రధమ కర్తవ్యమన్నారు. లోక్‌సభలో మాట్లాడిన ఆర్థిక మంత్రి ముఖ్యంగా యువతకు పుష్కలమైన అవకాశాలను కల్పించడం అనేది ప్రధాన దృష్టి కేంద్రాలలో ఒకటి అని పేర్కొన్నారు.
ఈపీఎఫ్‌ఓ సంఖ్య రెండింతలైందని, పీఎఫ్ ఖాతాల సంఖ్య 27 కోట్లకు చేరిందని ఆమె చెప్పారు. బడ్జెట్ 2023-24 కింద కేటాయించిన నిధులు యువత సాధికారతపై దృష్టి పెడతాయి. పరిశోధన, అభివృద్ధిపై దృష్టి సారించేందుకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తామని, ఆర్థిక అక్షరాస్యత కూడా ప్రోత్సహిస్తామని తెలిపారు. చిన్నారుల కోసం జాతీయ డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేసి, వివిధ వయస్సుల వారికి అనుగుణంగా పుస్తకాలను ప్రాంతీయ భాషల్లో సైతం అందుబాటులో ఉంచుతామన్నారు. కొత్త మెడికల్ కాలేజీలతోపాటు 157 కొత్త నర్సింగ్ కాలేజీల ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఫ్యూచరిస్టిక్ మెడికల్ టెక్, హై ఎండ్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో ఉద్యోగాల కల్పన ఉంటుందన్నారు. వైద్య పరికరాల తయారీకి అవసరమైన మల్టీడిసిప్లినరీ కోర్సులను విద్యాసంస్థల్లో ప్రారంభించేందుకు ప్రోత్సాహం అందిస్తామన్నారు. ఈ కోర్సులు నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనకు సహాయపడతాయన్నారు.