రోడ్డు ప్రమాదాల్లో ఏ ఒక్క ప్రాణం పోకుండా విధులు నిర్వర్తించేలా ఎల్లవేళలా పోలీసులు సంసిద్ధంగా ఉండాలని కాకినాడ ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా పోలీస్ అధికారులు, హైవే మొబైల్ వాహనాల సిబ్బందితో రహదారి భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణపై ఆయన మాట్లాడారు.ఈ సందర్భంగా ఎస్పీ పలు సూచనలు చేసి వాటి అమలుకు ఆదేశాలిచ్చారు. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన హైవే మొబైల్ సిబ్బంది సంబంధిత జోన్లలో పనిచేసే పోలీస్ అధికారులు, స్టేషన్ల సిబ్బంది పాదచారులను, వాహనదారులను అప్రమత్తం చేస్తూ రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా చేయాల్సిన ఆవశ్యతను తెలియజేశారు. మధ్యా హ్నం 3 గంటల నుంచి రాత్రి 9 వరకూ రోడ్డు ప్రమాదాలు ఎక్కు వగా జరిగే అవకాశం ఉన్నందున ఎన్‌హెచ్ 16, 216 లపై విజిబుల్ పోలీసింగ్ ఉండాలన్నారు. ఎనిమిది జోన్ల పరిధిలోనే కాకుండా ఇతర రోడ్డు మార్గాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలపై విశ్లేషణ చేసి సంబంధిత ఇన్‌స్పెక్టర్లకు, ఎస్‌హెచ్‌వోలకు పరిధిని పెంచి రహదారి గస్తీని మరింత విస్తృతం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం లో ఏఎస్పీ శ్రీనివాస్, ఏఆర్ అడ్మిన్ సత్యనారాయణ పాల్గొన్నారు.