తీగలాగితే...డొంక కదిలినట్లుగా గత నెల జమ్మూ కశ్మీర్‌లో జరిగిన జంట బాంబు పేలుళ్ల ఘటన కేసులో కీలక అంశాలు వెలుగులోకి వ చ్చాయి. ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆరిఫ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. రియాసీ జిల్లాలో పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఆరిఫ్ అరెస్టు సందర్భంగా విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చింది. అతడి నుంచి పెర్ఫ్యూమ్ బాంబును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇటువంటి బాంబును కశ్మీర్‌లో గుర్తించడం ఇదే తొలిసారని జమ్మూ కశ్మీర్ డీజీపీ దిల్‌బాగ్ సింగ్ తెలిపారు. కొత్త వ్యక్తులు ఎవరైనా పెర్ఫ్యూమ్ బాటిల్‌గా భావించి ప్రెస్ చేస్తే పేలిపోయేలా దీన్ని తయారుచేసినట్టు పేర్కొన్నారు. లిక్విడ్ ఐఈడీని పెర్ఫ్యూమ్ మాదిరిగా ఎటువంటి అనుమానం రాకుండా బాటిల్‌లో ఉంచుతారని వివరించారు.
జమ్మూకశ్మీర్ పోలీసు విభాగం ప్రత్యేక దళాలు వీటిపై దృష్టి సారించిందని, స్వాధీనం చేసుకున్న ఐఈడీని సురక్షితంగా నిర్వీర్యం చేస్తామని ఆయన చెప్పారు. ఉగ్రవాదాన్ని పొంచి పోషించిన పాకిస్థాన్.. జమ్మూ కశ్మీర్ ప్రజల మధ్య మత విభజన సృష్టించాలనుకుంటోందని డీజీపీ ధ్వజమెత్తారు. జనవరి 21న నర్వా ప్రాంతంలో జరిగిన జంట పేలుళ్ల ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. జనవరి 20 రెండు ఐఈడీలను అమర్చిన ఉగ్రవాదులు... జనవరి 21న 20 నిమిషాల వ్యవధిలో పేల్చారు. ఈ ఘటనలో 9 మంది గాయపడగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
ఈ జంట పేలుళ్లతో ఆరిఫ్‌కు సంబంధం ఉందని గుర్తించిన పోలీసులు గురువారం అతడ్ని అరెస్టు చేశారు. గత మూడేళ్లుగా పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థతో సంబంధాలు కొనసాగిస్తున్నట్టు విచారణలో వెల్లడయ్యింది. గతేడాది మే 24న వైష్ణో దేవి ఆలయానికి భక్తులతో వెళుతున్న బస్సుపై జరిగిన బాంబు దాడి ఘటనలో కూడా తనకు ప్రమేయం ఉందని అంగీకరించాడు.