పెందుర్తి నియోజకవర్గ పరిధి పరవాడ సినిమా హాల్ జంక్షన్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో పరవాడలో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మించాలని డిమాండ్ చేస్తూ గురువారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గని శెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ పరవాడ ఎన్టిపిసి లో కాంట్రాక్ట్ కార్మికులు 2000 మంది ఫార్మాసిటీలో 30 వేల మంది చిన్న తరహా పరిశ్రమల్లో 2000 మంది కార్మికులు పనిచేస్తున్నారని ప్రమాదాలు జరిగినప్పుడు అనారోగ్యాలు గురైనప్పుడు కార్మికులు విశాఖపట్నం ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోవడం దూర ప్రాంతం కావడంతో వెళ్లలేక ప్రైవేట్ ఆస్పత్రులకు వైద్యానికి వెళ్ళవలసిన వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఫార్మాసిటీలో బర్న్ అయిన కార్మికులను విశాఖపట్నం తరలించే లోపు కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని ఆయన అన్నారు. గతంలో ఎంపీ డాక్టర్ బి. వి. సత్యవతి , పెందుర్తిఎమ్మెల్యే పరవాడలో ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మిస్తామని కార్మికుల కష్టాలు తీరుస్తామని అనేక వాగ్దానాలు చేసి నేటికీ ఆసుపత్రి నిర్మించకపోవడం విచారకరమన్నారు. ప్రభుత్వాలకు కార్పొరేటర్లకు సేవ చేస్తున్నారే గాని చట్టబద్ధంగా ఉన్న ఈఎస్ఐ ఆసుపత్రి పరవాడలో ఏర్పాటు చేయడానికి చిత్తశుద్ధితో కృషి చేయడం లేదని గని శెట్టి విమర్శించారు. దీనికి తోడు విశాఖపట్నంలో 500 పడకల ఆసుపత్రి నిర్మాణానికి నిధులు విడుదల చేస్తామని వాగ్దానం చేస్తున్న బిజెపి నేతలు తీర నేటికీ 350 పడకులకి కుదించారని అన్నారు. వేలాది మందితో ఈఎస్ఐ డబ్బులు కట్టించుకుంటున్న ఈఎస్ఐ కార్పొరేషన్ నుండి ఆసుపత్రి ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వంపై ఉద్యమిస్తామని గని శెట్టి హెచ్చరించారు. వెంటనే ఎంపీ ఎమ్మెల్యే ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన ర్యాలీలో సిఐటియు నాయకులు కన్నూరు. నాయుడు, డోకల జగన్, వి బాపు నాయుడు, పి శ్రీను, ఎం అప్పారావు ఎస్. చిన్నారావు , తదితరులు పాల్గొన్నారు