చేనేతల జీవితాలతో వైసీపీ చెలగాటమాడుతోందని టీడీపీ చేనేత విభాగం నాయకులు విమర్శించారు. ధర్మవరం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు, ఆకలిచావులు పెరిగాయని, ప్రభుత్వం చేతగాని తనమే ఇందుకు కారణమని మండిపడ్డారు. టీడీపీ హయాం లో చేనేతల సంక్షేమం కోసం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నో పథకాలను అమలుచేశారని గుర్తుకుచేశారు. ఒక్క ధర్మవరం పట్ట ణంలోనే 13,650 మంది చేనేత కార్మికులకు ముడిపట్టుపై సబ్సిడీని అందిం చామని, వైసీపీ వచ్చిన తరువాత ముడిపట్టు సబ్సిడీని అటకెక్కించిందని విమర్శించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వార్పు ధరరూ.3వేలు ఉండగా ప్రస్తుతం రూ.6వేలకు చేరిందన్నారు. అలాగే సపూరి ధర గతంలో రూ.2500 ఉండగా ప్రస్తుతం రూ.5500కు చేరిందంటే అది వైసీపీ అసమర్థత కాదా అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో ఆదరణ పథకం ద్వారా ఒక్కొక్క చేనేత కార్మికుడికి రూ.30వేలు విలువ చేసే చేనేత పనిముట్లను ఇచ్చి ఆదుకుందన్నారు. ప్రస్తుతం ఒక్క పనిముట్టు కూడా ఇవ్వలేదన్నారు. టీడీపీ హయాంలో బీసీ కార్పొరేషన కింద ప్రతి చేనేత కార్మికుడికి రూ.లక్ష సబ్సిడీ, బ్యాంకు రుణం రూ.లక్ష ఇచ్చి ఆదుకుంద న్నారు. అలాగే చేనేత వర్గాలపై విధిస్తున్న జీఎస్టీని తక్షణమే రద్దుచేసే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని డిమాండ్‌చేశారు.