విజయవాడ నగరవాసులకే కాదు.. రాష్ట్రస్థాయిలో కళాప్రియులందరికీ సుపరిచితమైన పేరు తుమ్మలపల్లి కళాక్షేత్రం. దీనిపైనా జగన్ సర్కారు రాజకీయానికి తెరదీసింది చెప్పవచ్చు. రాష్ట్రంలో యూనివర్సిటీలకు, పథకాలకు పేర్లు మార్చేసినట్లే.. మరో ప్రముఖ సాంస్కృతిక కేంద్రం పేరును జగన్ ప్రభుత్వం మార్చేసింది. ‘తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం’గా ఉన్న పేరును మార్చేసి కేవలం ‘కళాక్షేత్రం’ అని ఉంచింది. మహాకవి, దాత ఔన్నత్యాన్ని కించపరిచేలా వ్యవహరించడం హేయమని సాహితీప్రియులు, నగరవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ నగరంలో ఆర్టీసీ బస్‌స్టేషన్, రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఏలూరు కాల్వ, రైవాస్ కాల్వ నడుమ తుమ్మలపల్లి కళాక్షేత్రం ఉంది.