తన ఆస్తులపై సీబీఐ విచారణ చేయాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అనడం హాస్యాస్పదంగా ఉందని చిత్తూరు జిల్లా పుత్తూరు తెలుగు దేశం పార్టీ ఇన్‌ఛార్జ్ భాను ప్రకాష్ పేర్కొన్నారు. రోజా సెల్వమణికి ధైర్యం ఉంటే తన ఆస్తులపై సీబీఐ విచారణ కోరాలని ఆయన సవాల్ విసిరారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రపై మంత్రి రోజా తీవ్ర ఆరోపణలు చేస్తున్న తరుణంలో భాన్ ప్రకాష్ కౌంటర్ ఇచ్చారు. పుత్తూరు నియోజకవర్గంలో పాదయాత్రకు ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చారన్నారు. లోకేష్ పాదయాత్రకు తమిళనాడు రాష్ట్రం నుంచి ప్రజలను తీసుకురాలేదని స్పష్టం చేశారు.
నారా లోకేష్‌కు సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారని భాను ప్రకాష్ అన్నారు. తన ఆస్తులపై సీబీఐ విచారణ చేయాలని మంత్రి రోజా అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మంత్రి రోజాకు ధైర్యం ఉంటే ఆమె ఆస్తులపైనే సీబీఐ విచారణ కోరాలని డిమాండ్ చేశారు. లేకపోతే టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రి రోజా ఆస్తులపై సీబీఐ విచారణ చేయిస్తామని వెల్లడించారు.
మంత్రి రోజా చరిత్ర అందరికీ తెలుసని భాను ప్రకాష్ తెలిపారు. రోజా ఫ్యామిలీ మన్నార్ గుడి మాఫియాగా పెట్రేగిపోయిందన్నారు. అయినా కువైట్, దుబాయ్ దేశాల్లో రోజాకు పనేంటని ప్రశ్నించారు. పర్యాటక శాఖను మంత్రి రోజా ఏ మాత్రం అభివృద్ధి చేయలేదని దుయ్యబట్టారు. ఇక, మహిళలు తలవంచుకునేలా మంత్రి రోజా వ్యవహారశైలి ఉందన్నారు.
ఇక, నగరి నియోజకవర్గంలో మంత్రి రోజా చేస్తున్న అవినీతికి అడ్డూ అదుపూ లేకుండా పోయిందని భాను ప్రకాష్ అన్నారు. నగరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోజాకు వాటా లేనిదే, ఏ ఒక్క పని ప్రారంభం కాదన్నారు. భూకబ్జా, మట్టి మాఫియా, గ్రావెల్ మాఫియా మొత్తం రోజా కనుసన్నల్లోనే జరుగుతోందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో మంత్రి రోజా నగరిలో ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు.