తెలుగుదేశం పార్టీలో కొత్త తరం అడుగుపెడుతోంది. కొందరు సీనియర్లు ఎన్నికల రాజకీయాలకు గుడ్‌బై చెప్పి తమ వారసులను రంగంలోకి దించుతున్నారు. 40 ఏళ్లు పూర్తి చేసుకున్న టీడీపీలో కొన్ని నియోజకవర్గాల్లో ఇలా జరుగుతోంది. బాగా చదువుకుని వివిధ వృత్తి వ్యాపారాల్లో ఉన్న ఈ తరం.. తమ కుటుంబ వారసత్వాన్ని కొనసాగించేందుకు రాజకీయాల్లోకి వస్తున్నారు. వీరు ఏ మేరకు నిలదొక్కుకుంటారా అని పార్టీ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి. ఆవిర్భావ సమయం నుంచి టీడీపీలో కొనసాగుతున్న సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్య ఈసారి తుని అసెంబ్లీ సీటు నుంచి బరిలోకి దిగబోతున్నారు. 1983 నుంచి 2009 వరకూ ఆ నియోజకవర్గంలో వరుసగా రామకృష్ణుడు పోటీ చేశారు. ఆ తర్వాత ఆయన సోదరుడు కృష్ణుడు రెండుసార్లు పోటీచేశారు. కానీ నెగ్గలేకపోయారు. అభ్యర్థి మార్పు జరగాలని పార్టీ అధిష్ఠానం గట్టిగా సూచించడంతో దివ్యకు నియోజకవర్గ ఇన్‌చార్జి పదవి దక్కింది. ఆమె భర్త గోపీనాథ్ ప్రస్తుతం ఐఆర్‌ఎస్ అధికారిగా పనిచేస్తున్నారు. ఆమె నియామకంపై కృష్ణుడు కొంత అసంతృప్తిగా ఉండడంతో దానిని దివ్య ఎలా అధిగమిస్తారో చూడాల్సి ఉందని టీడీపీ వర్గాలు అంటున్నాయి.
నెల్లూరు జిల్లా కోవూరులో మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి తన కుమారుడు దినేశ్‌రెడ్డిని తెరపైకి తెచ్చారు. దినేశ్‌ను టీడీపీ నాయకత్వం ఆ నియోజకవర్గ ఇన్‌చార్జిగా కూడా నియమించింది. పోలంరెడ్డి ఆ నియోజకవర్గంలో మూడుసార్లు గెలిచి సీనియర్‌గా గుర్తింపు పొందారు. అందరితో సౌమ్యంగా వ్యవహరిస్తున్న దినేశ్ ప్రస్తుతానికి మంచి మార్కులే వేయించుకుంటున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో మాజీ మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు స్థానంలో ఆయన తమ్ముడు రావు వెంకట శ్వేత కుమార కృష్ణ రంగారావు (బేబినాయన) రంగంలోకి వచ్చారు. సుజయ్‌కృష్ణ రెండుసార్లు గెలిచి ఒకసారి మంత్రిగా చేశారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా నియోజకవర్గ పార్టీ వ్యవహారాలను బేబినాయనే చూసేవారు. నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి కుమార్తె కైవల్యారెడ్డి తెరపైకి వచ్చారు. ఆమె ఆ జిల్లాలో టీడీపీ నుంచి ఆత్మకూరు సీటును ఆశిస్తున్నారు. ఆ నియోజకవర్గంలో ఆనం కుటుంబానికి కొంత పట్టుంది. రామనారాయణరెడ్డి వైసీపీలో ఉన్నా ఆమె భర్త రితీశ్‌కుమార్‌రెడ్డి కడప జిల్లాలో టీడీపీ నేతగా ఉన్నారు. రితీశ్ తాత బిజివేముల వీరారెడ్డి మాజీ మంత్రి.. బద్వేలు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన మరణానంతరం ఆయన కుమార్తె, రితీశ్ తల్లి విజయమ్మ కూడా బద్వేలు నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో ఆ నియోజకవర్గాన్ని ఎస్సీలకు రిజర్వు చేయడంతో అక్కడ ఆ కుటుంబానికి పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. రామనారాయణరెడ్డికి కుమారుడు ఉన్నా ఆయన తన కుమార్తె రాజకీయ ఎదుగుదలకు మద్దతిస్తున్నట్లు కనిపిస్తోంది. కైవల్య ఇప్పటికే టీడీపీ కార్యక్రమాల్లో కనిపిస్తున్నారు. చిత్తూరు జిల్లా సత్యవేడు(ఎస్సీ) నియోజకవర్గంలో టీడీపీ నుంచి కొత్త తరం నేత హెలెన్ వస్తున్నారు. ఆమె చెన్నైలో వైద్య వృత్తిలో ఉన్నారు. ఆమె తల్లి హేమలత గతంలో సత్యవేడు నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత ఆ నియోజకవర్గంలో తలారి ఆదిత్యకు అవకాశం వచ్చింది. ఆయన గెలిచారు కూడా. కానీ ఓటమి తర్వాత నియోజకవర్గంపై పట్టు కోల్పోయారు. అక్కడ అందరినీ కలుపుకొని వెళ్లడానికి హేమలత కుటుంబమైతే బాగుంటుందన్న అభిప్రాయంతో ఉన్న పార్టీ నాయకత్వం ఆమె కుమార్తెకు అవకాశం ఇచ్చింది. కొద్ది రోజుల క్రితం హెలెన్‌ను ఆ నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించారు.