ప్రస్తుతం దేశంలో తెలుగుతో కలిపి ఆరు భాషలకు ప్రాచీన హోదా లభించింది. వీటిలో సంస్కృతం, తమిళం, మలయాళం, ఒడియా, కన్నడం ఉన్నాయి. దేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో తెలుగు నాలుగో స్థానంలో ఉంది. హిందీ, బెంగాలీ, మరాఠీ తర్వాత తెలుగు మాట్లాడేవారు 8.11 కోట్ల మంది ఉన్నారు. అయితే, తెలుగు భాషకు ప్రాచీన హోదా విషయంలో సుదీర్ఘ కాలంపాటు వేచి చూడాల్సి వచ్చింది. ఎట్టకేలకు ప్రాచీన భాషగా ప్రకటించినా, దానికి అనుగుణంగా అధ్యయన ప్రయత్నాలకు మరో దశాబ్దకాలం పట్టింది. మూడేళ్ళ క్రితం కర్ణాటకలో ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రాన్ని స్థాపించారు. దానిని తెలుగు నేలకు తరలించి ఏడాది దాటింది.
కేంద్ర మానవ వనరులశాఖ ఆధ్వర్యంలో, ఆయా భాషల చారిత్రక, సాంస్కృతిక, వారసత్వ చరిత్రను పరిశోధించి, పరిరక్షించేందుకు ఈ హోదా ఉపయోగపడుతుంది. దానికి తగ్గట్టుగా జాతీయ భాషా సంస్థ పర్యవేక్షణలో అధ్యయన కేంద్రాలు ఏర్పాటవుతాయి. ప్రస్తుతం అన్ని భాషలకు అధ్యయన కేంద్రాలు ఉండగా, సంస్కృతం, తమిళ భాషలను మాత్రం అటానమస్ చేశారు. దాంతో, ఈ రెండు భాషలకు అధిక నిధులు కేటాయించే అవకాశం ఏర్పడింది.