తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర ను విజయవంతం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి పరిటాల సునీతా పిలుపునిచ్చారు. రాప్తాడులో టీడీపీ సత్తా చాటాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతపురంలోని తన ఇంట్లో.. నియోజకవర్గ ముఖ్య నేతలు, నాయకులతో సునీత భేటీ అయ్యారు. రాప్తాడు నియోజకవర్గంలో ఏయే ప్రాంతాల మీదుగా పాదయాత్ర సాగితే బాగుంటుందన్న అంశంపై చర్చలు జరిపారు. వచ్చే నెలలో ఉమ్మడి జిల్లాకు లోకేష్ పాదయాత్ర చేరుకునే అవకాశం ఉండటంతో.. ఈ సమావేశం నిర్వహించారు.
ఉమ్మడి జిల్లాలో ముందుగా కదిరి, ధర్మవరం, ఆ తర్వాత రాప్తాడు నియోజకవర్గంలో పాదయాత్ర జరిగే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుంచే నాయకులు, కార్యకర్తలు సన్నద్ధం కావాలని సునీత సూచించారు. చిత్తూరు జిల్లాకు మించిన స్పందన రాప్తాడు నియోజకవర్గంలో ఉండాలని స్పష్టం చేశారు. నాలుగేళ్లుగా అధికార పార్టీ నాయకులు చేస్తున్న దౌర్జన్యాలు, ప్రజావ్యతిరేక విధానాల గురించి లోకేష్ దృష్టికి తీసుకువెళదామని.. ప్రతి గ్రామం నుంచి Nara Lokesh పాదయాత్ర సాగేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని.. నాయకులు, కార్యకర్తలు సైనికుల్లాగా పనిచేయాలని మాజీ మంత్రి పరిటాల సునీత సూచించారు.