ఉద్యోగులకు కేవలం జీతాలు పెంచితే సరిపోద్దు. వారిని సెలవులు ఇచ్చి ప్రోత్సహించాలి మరి. వారంలో నాలుగు రోజుల పని అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. వినడానికే ఇది ఎంతో ఉత్సాహంగా అనిపిస్తుంది. అసలు వారంలో నాలుగు రోజుల విధానంతో ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దామని అనుకున్నారు. బ్రిటన్ లో ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేసి చూశారు. ఫలితాలను చూసిన కంపెనీలు తిరిగి తాము ఐదు రోజుల పని విధానానికి వెళ్లబోమని తేల్చి చెబుతున్నాయి. అంత చక్కని ఫలితాలు ఈ విధానంలో కనిపించాయి.
ఈ అతిపెద్ద ప్రయోగాత్మక విధానంలో చాలా కంపెనీలు భాగమయ్యాయి. మెజారిటీ కంపెనీలు ఫలితాల పట్ల సంతృప్తిగా ఉన్నాయి. తిరిగి పాత విధానానికి వెళ్లడానికి ఎలాంటి కారణం కనిపించడం లేదని కంపెనీలు అంటున్నాయంటే, ఫలితాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అడ్వొకసీ గ్రూప్ ఈ ప్రయోగాత్మక విధానాన్ని అమలు చేయడంలో కీలక పాత్ర పోషించింది.
నాలుగు రోజుల పని విధానం వల్ల నిద్ర, ఒత్తిడి సమస్యలు ఉండడం లేదని, వ్యక్తిగత జీవితం, మానసిక ఆరోగ్యం మెరుగుపడినట్టు ఉద్యోగులు చెప్పారు. పైగా పనిలో ఉత్పాదకత కూడా పెరిగింది. వివిధ రంగాల నుంచి 61 కంపెనీలు ఈ ప్రయోగాత్మక నాలుగు రోజుల పని విధానాన్ని అమలు చేసి చూశాయి. 3,000కు పైగా ఉద్యోగులు పాలు పంచుకున్నారు. మొత్తం మీద 91 శాతం కంపెనీలు నాలుగు రోజుల పని విధానాన్ని ఇక ముందూ కొనసాగిస్తామని చెప్పాయి. 4 శాతం కంపెనీలు ఏటూ తేల్చుకోలేకున్నాయి. మరో 4 శాతం కంపెనీలు తిరిగి ఐదు రోజుల విధానానికి మారిపోతామని చెప్పాయి.