పట్టాభి లాంటి ప్రజా ప్రతినిధులపై దాడిని ఖండిస్తున్నామని జనసేన పార్టీ పీఏసీ సభ్యుడు, మెగా బ్రదర్ నాగబాబు టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభికి మద్దతు తెలిపారు. గన్నవరంలో పరిణామాలు, ఆయనపై కేసులు నమోదు చేయడంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘పట్టాభి లాంటి ప్రజా ప్రతినిధులపై దాడిని ఖండిస్తున్నాం. వైఎస్సార్‌సీపీ ప్రజలు ఇచ్చిన అధికారాన్ని వ్యక్తిగత ప్రతీకారం కోసం ఎలా వాడుకుంటున్నారో చెప్పడానికి టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిపై జరిగిన దాడి నిదర్శనం. తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలకు గురిచేశారని ముఖానికి టవల్ చుట్టి ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా కొట్టారని ఆయన ఆవేదన వింటుంటే ఆశ్చర్యం అనిపిస్తోంది. కరుడుగట్టిన నేరస్థులతో విచ్చలవిడిగా పట్టాభి లాంటి ప్రజా ప్రతినిధులపై దాడులు చేయడం ప్రజాస్వామ్య పద్ధతికి పూర్తి విరుద్ధం’అంటూ నాగబాబు ట్వీట్ చేశారు.
మరోవైపు గన్నవరం ఘటనలో పట్టాభిపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కోర్టు రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించారు. ఈ కేసులో పట్టాభితో పాటుగా అరెస్టైన మరో పది మందిని గన్నవరం పోలీసులు రాజమండ్రి జైలుకు తీసుకెళ్లారు.
అంతకముందు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఇచ్చిన రిపోర్టును జడ్జికి అందజేశారు. పట్టాభి ఆరోగ్యం నిలకడగానే ఉందని.. రెండు అరచేతులకున్న గాయాలు చిన్నపాటివేనని అందులో ప్రస్తావించారు. ఈ రిపోర్ట్‌ను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. పట్టాభిని రిమాండ్ విధించారు. జడ్జి ఆదేశాలతో గన్నవరం సబ్ జైలుకు తరలించారు. కానీ గన్నవరం జైలు అధికారి యూనస్ కోర్టులో మరో మెమో దాఖలు చేశారు. ఈ కేసులో నిందితులకు సరిపడా గదులు లేవని.. శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా కూడా తమకు ఇబ్బంది ఉందని పోలీసులూ కూడా కోర్టుకు నివేదించారు. దీంతో ఆయన్ను రాజమండ్రికి తరలించారు.
ఇదిలా ఉంటే.. పట్టాభి పోలీసులపై నిందలు వేసేలా వ్యూహం పన్నారని.. కానీ అది విఫలమైందన్నారు కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా. పట్టాభి అవాస్తవాలతో కోర్టును తప్పుదోవ పట్టించాలని చూశారని.. గన్నవరం ఘటనలో గాయపడిన సీఐ కనకారావు సామాజిక వర్గంపై కొందరు వివాదాలు సృష్టిస్తున్నారన్నారు. టీడీపీ ఆఫీసుపై దాడి ఘటనలో ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా సుమోటోగా కేసు నమోదు చేశామన్నారు. మరోవైపు గన్నవరంలో పరిణామాలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ప్రజా వ్యతిరేక పాలనను ప్రశ్నిస్తే.. ప్రజలు, ప్రతిపక్షాలపై దాడులు, కేసులు, హింసాత్మక ఘటనలు, పోలీసు టార్చర్ అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ఇందుకు గన్నవరం విధ్వంసం ఒక తాజా ఉదాహరణగా చెప్పుకొచ్చారు.