కొత్త కొత్త నియమనిబంధనలతో టీటీడీ తనదైన శైలీలో అడుగులు వేస్తోంది. ఇదిలావుంటే తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు నేటి నుంచి కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. ఇకపై తిరుమల శ్రీవారి దర్శనం, గదుల కేటాయింపు, లడ్డూ ప్రసాదం, రీఫండ్ చెల్లింపులు వంటి అంశాల్లో ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీని అమలు చేస్తోంది. టీటీడీ సేవల్లో పారదర్శకత పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. మంగళవారం తిరుమలలోని గదుల కేటాయింపు కేంద్రాల దగ్గర ప్రయోగాత్మకంగా కెమెరాలతో ఈ సాంకేతికతను పరిశీలించారు. ఖాళీ చేసే సమయంలోనూ గదులు పొందినవారే వచ్చి మళ్లీ ఫేస్ రికగ్నేషన్ చేయిస్తే కాషన్ డిపాజిట్ చెల్లిస్తారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లో టోకెన్లు లేకుండా సర్వదర్శనానికి వచ్చే భక్తులకు ఈ సాంకేతికత సాయంతో లడ్డూలు అందజేయనున్నారు.
తిరుమలలో దళారీలకు చెక్ పెట్టేందుకు ప్రధానంగా ఈ విధానం ఎంతో ఉపయోగపడుతుందని టీటీడీ భావిస్తోంది. ఈ నిర్ణయంతో పారదర్శకత కూడా మరింత పెరుగుతుందని.. ఈ టెక్నాలజీని ప్రయోగాత్మంగా పరిశీలిస్తున్నారు. ఆ తర్వాత పూర్తిస్థాయిలో అమలుపై నిర్ణయం తీసుకుంటారు.. నేటి నుంచి అమలయ్యే ఈ విధానాన్ని గమనించాలని టీటీడీ కోరింది.
ఇదిలా ఉంటే.. తిరుమలలో జారీ చేసే కరెంట్ బుకింగ్ శ్రీవాణి దర్శన దాతల టికెట్ల కోటాను పెంచింది. ప్రస్తుతం రోజూ వెయ్యి మందికి ఈ టికెట్లను టీటీడీ జారీ చే స్తోంది. 750 ఆన్‌లైన్‌లో, 150 టికెట్లు తిరుమలలోని గోకులంలో, మరో వంద టికెట్లను తిరుపతి ఎయిర్‌పోర్ట్ కరెంట్ బుకింగ్ ద్వారా జారీ చేస్తున్నారు. నేటి నుంచి ఆన్‌లైన్ కోటాను 750 నుంచి 500కు కుదించి.. గోకులం కార్యాలయంలో 150 నుంచి 400కు టికెట్ల కోటాను పెంచింది.
తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు తలనీలాలు తీసే క్షురకులు ఇన్ఫెక్షన్లు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తిరుపతికి చెందిన ప్రముఖ వైద్యురాలు డాక్టర్ కృష్ణప్రశాంతి సూచించారు. తిరుమల ఆస్థాన మండపంలో మంగళవారం కళ్యాణకట్ట క్షురకులకు ఆరోగ్యంపై అవగాహన సదస్సు నిర్వహించారు. క్షురకులు భక్తులకు చాలా దగ్గరగా ఉండి సేవలందిస్తారని.. కావున మాస్కులు ధరించడం అత్యంత ముఖ్యమని డాక్టర్ కృష్ణప్రశాంతి తెలిపారు.
ప్రధానంగా ఊపిరితిత్తులు, వెంట్రుకలు, ముక్కు ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందన్నారు. వీటిని నివారించేందుకు లోషన్ తో ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోవాలని, చేతులకు తడి లేకుండా చూసుకోవాలని సూచించారు. ఎక్కువసేపు కూర్చొని పని చేయాల్సి రావడం వల్ల మోకాలి నొప్పి, నడుము నొప్పి రాకుండా గంటకోసారి ఐదు నిమిషాలు లేచి నడవాలని చెప్పారు. విధులు ముగిసిన తర్వాత ప్రతి ఒక్కరూ మెడ, భుజాలకు సంబంధించిన వ్యాయామం చేయాలని సూచించారు. అనంతరం పలువురు క్షురకులు అడిగిన అనారోగ్య సమస్యలకు పరిష్కారాలను తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa